రోగి కాళ్లు, చేతులు కొరికిన ఎలుకలు

1 Apr, 2022 03:36 IST|Sakshi

వరంగల్‌ ఎంజీఎం ఐసీయూలో దారుణం..

ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఘటన

తొలిసారి చేతి వేళ్లు కొరకగా కట్టుకట్టి వదిలేసిన సిబ్బంది

తాజాగా ఎడమ చేయి, కాలి మడమ కొరికిన మూషికాలు

తీవ్ర రక్తస్రావం.. పరిస్థితి విషమం

వెంటనే నివేదిక తెప్పించుకున్న మంత్రి హరీశ్‌రావు

సూపరింటెండెంట్‌ బదిలీ..  ఇద్దరు వైద్యుల సస్పెన్షన్‌

ఎంజీఎం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకెల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రిగా పేరుగాంచిన వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం) ఐసీయూలోకి ఎలుకలు జొరబడ్డాయి. వెంటిలేటర్ల ద్వారా కృత్రిమశ్వాస అందించే వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేశాయి. కాళ్లు, చేతులు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. అధిక రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆ రోగి పరిస్థితి విషమంగా ఉంది.

ఏమీ కాదులే అంటూ...
రోగి బంధువుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ (42) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత నెల 26న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆర్‌ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందిస్తున్నారు. గత నెల 27న శ్రీనివాస్‌ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికినట్లు బంధువులు గమనించారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు కట్టుకట్టి ఏమీ కాదులే అని వదిలేశారు. అయితే గత నెల 30న అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌పై ఎలుకలు మరోసారి దాడి చేశాయి.

ఆయన ఎడమ చేయి, కాలి వేళ్లతోపాటు మడమ వద్ద కొరకడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే అతని సోదరుడు శ్రీకాంత్‌ విషయాన్ని వైద్యులతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఇదేమి ఆస్పత్రి.. వైద్యం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన వైద్యులు రోగికి చికిత్స అందించారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆస్పత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్‌..
ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు అదనపు కలెక్టర్‌ శ్రీవాత్సవ గురువారం ఎంజీఎంకు చేరుకొని సూపరిండెంట్‌ శ్రీనివాస్, వైద్య బృందంతో కలసి ఆర్‌ఐసీయూ వార్డును సందర్శించారు. ఎలుకల సంచారం వెనక ఎవరి నిర్లక్ష్యం ఉందంటూ పరిపాలనాధికారులను ప్రశ్నించారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఆర్‌ఐసీయూ వార్డుతోపాటు ఆస్పత్రిలో సాధారణ వార్డులన్నీ కలియతిరిగి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు.

ప్రాణంపోతే ఎవరిది బాధ్యత?
శ్రీనివాస్‌ను తొలిసారి ఎలుకలు గాయపరిచిన ఘటనను ఆస్పత్రి అధికారులతోపాటు వైద్యుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా పరిపాలనాధికారులు పట్టించుకోలేదు. వైద్యాధికారుల అలసత్వం వల్లే మరోసారి ఎలుకలు శ్రీనివాస్‌ను కొరికిపెట్టాయి. దీనివల్ల ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇప్పుడు ఆయన ప్రాణం పోతే ఎవరు బాధ్యులవుతారో చెప్పాలి?
– రోగి బంధుమిత్రులు

సూపరింటెండెంట్, ఇద్దరు వైద్యులపై చర్యలు...
సాక్షి, హైదరాబాద్‌: ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించారు. పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక పంపాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్‌ఐసీయూ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఘటనకు కారణాలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఎంజీఎం సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు యాకుబ్, ఆబీబీలను సస్పెండ్‌ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదని హరీశ్‌రావు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు