రావినూతల శశిధర్‌కు న్యాయశాస్త్రంలో  పీహెచ్‌డీ డాక్టరేట్‌

3 Nov, 2022 19:52 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో ‘‘యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ - ఎ కంపారేటివ్ స్టడీ’’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్‌. బీ. ద్వారకానాథ్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసిన రావినూతల శశిధర్‌కు ఉస్మానియా యూనివర్సిటి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది . 

అమెరికా జంట టవర్ల పేలుళ్ళ అనంతరం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి వివిధ ప్రపంచ దేశాలు చేసిన తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలు మరియు వాటి పనితీరు, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు వాటి ప్రభావం , ఐక్య రాజ్య సమితి వివిధ విభాగాల ఏర్పాటు మరియు వాటి పనితీరు, భారత దేశంలో వివిధ రూపాలలో ఉన్న తీవ్రవాద మూలాలు, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ లో ప్రస్తుతం ఉన్న చట్టాల పనితీరు, నూతన చట్టాల ఆవశ్యకత, తీవ్రవాద వ్యతిరేఖ చట్టాల అమలులో భారతదేశ కోర్టుల పాత్ర, కఠిన చట్టాల ఆవశ్యకత - మానవ హక్కులు రక్షణ తదితర అంశాలపై లోతైన అధ్యయనంతో కూడిన పరిశోధన థిసిస్‌ను రావినూతల శశిధర్ సమర్పించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలపై రావినూతల శశిధర్ వ్రాసిన పలు ఆర్టికల్స్‌ను ప్రముఖ లీగల్ జర్నల్స్ ప్రచురించాయి, పరిశోధనలో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన పలు జాతీయ స్థాయి సెమినార్‌లలో కూడా శశిధర్ పాల్గొని ప్రసంగించారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య తీవ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రస్తుత చట్టాల పనితీరుపై విస్తృత పరిశోధన చేసి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మరియు భారత దేశంలోని చట్టాలలో రావాల్సిన మార్పులపై ఈ పరిశోధనలో చేసిన పలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు శశిధర్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రావినూతల శశిధర్.. తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలపై విస్తృత పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు సాధించడం పై పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు