రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్‌’! మిగిలిన కాస్త భూమి ఇచ్చేస్తే ఎలా బతకాలని గ్రామస్తుల ఆవేదన 

10 Sep, 2022 02:36 IST|Sakshi

ఇప్పటికే ప్రజా అవసరాల కోసం మూడుసార్లు భూసేకరణ 

కాళేశ్వరం కాల్వలకు ఓసారి.. రోడ్డుకు మరోసారి.. విద్యుత్‌ లైన్లకు ఇంకోసారి 

ఇప్పుడు మళ్లీ గ్రామం మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు  

సాక్షి, యాదాద్రి: అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్‌–వరంగల్‌ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం మరికొంత భూమి పోయింది.. తమ ప్రాంతం పచ్చగా అవుతుంది కదా అనుకున్నారు.

యాదాద్రి అభివృద్ధికి, హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంది. అటు దేవుడు, ఇటు కరెంటు.. ఇవ్వలేక ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రీజనల్‌ రింగు రోడ్డు తెరపైకి వచ్చింది. దాని అలైన్‌మెంటు కూడా రాయగిరి గ్రామం మీదుగానే వెళుతోంది. ఇన్నిసార్లు భూములు ఇచ్చామని.. ఇప్పుడూ ఇస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాయగిరి వాసులు వాపోతున్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చాలని వేడుకుంటున్నారు. రాయగిరి గ్రామంలో వందలాది మందికి ఉపాధి కల్పించే రైస్‌ మిల్లులు, హోటళ్లు మొత్తం రోడ్డు విస్తరణలో పోతున్నాయని అంటున్నారు.  

80 ఎకరాల సేకరణ కోసం.. 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్‌ జంక్షన్‌ సర్కిల్‌ కోసం 80 ఎకరాలు సేకరిస్తున్నారు. ముందుగా 60 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికి.. జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 20 ఎకరాలు పెంచారు.  

అలైన్‌మెంట్‌ మార్చారా? : ముందుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు తుర్కపల్లి మండలం నుంచి రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల మీదుగా భువనగిరి మండలంలోకి వెళ్లేలా ప్రాథమికంగా ప్రతిపాదించారు. తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానానికి ఉత్తరం వైపు నుంచి కాకుండా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, దాతర్‌పల్లి మీదుగా కలెక్టరేట్‌ నుంచి రాయగిరి గ్రామం మీదుగా వలిగొండ మండలం వరకు తాజా ప్రతిపాదనతో గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. ముందుగా రాయగిరి గ్రామానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

మూడుసార్లు భూములు పోతే ఎలా..? 
రాయగిరి రెవెన్యూ పరిధిలోని బాలెంపల్లికి చెందిన బద్దం నర్సింహారెడ్డికి ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలోనే హైటెన్షన్‌ లైన్‌ కోసం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. తాజాగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం మూడు 3 ఎకరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో పది మంది రైతులది ఇదే పరిస్థితి. పంటలు పండే భూములు ఇలా తీసుకుంటే తాము ఎలా బతకాలని నర్సింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు.  

గుంట భూమి లేకుండా పోతుంది 
సర్వే నంబర్‌ 690లో మా అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంటులో గుంట భూమి లేకుండా పోతోంది. దీంతో మాకు బతుకు దెరువు కష్టమవుతోంది. రోడ్డు అలైన్‌మెంటు మార్చి మా జీవితాలు కాపాడాలి.      
– తెల్జూరి ఐలయ్య, రాయగిరి  

అలైన్‌మెంట్‌ మార్చాలి 
సర్వే నంబర్‌ 726లో 7.15 ఎకరాల భూమిపోతోంది. ఇందులో ఆరుగురు రైతులు తమ భూములు మొత్తం కోల్పోతున్నారు. ముందుగా ఇచ్చిన మ్యాప్‌ ప్రకారం ఈ సర్వే నంబర్‌లో 4 ఎకరాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. కానీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మార్చిన అలైన్‌మెంట్‌తో భూమి మొత్తం పోతోంది. వెంటనే రింగురోడ్డు అలైన్‌ మెంట్‌ మార్చాలి.     
– అవిశెట్టి పాండు, రాయగిరి 

గుంట భూమి కూడా మిగలకుండా.. 
రాయగిరికి చెందిన కోటం భద్రయ్యకు ఉన్న 4.17 ఎకరాల భూమి మొత్తం రీజనల్‌ రింగ్‌రోడ్డులో పోతోంది. గతంలో ఆయన భూమిలో రెండు ఎకరాలను హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు, టవర్ల కోసం ప్రభు త్వం తీసుకుంది. అలాగే జాతీయ రహదారి విస్తరణ కోసం 34 గుంటల భూమి, ఇల్లు పోయాయి. తాజా ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం ఉన్న మొత్తం భూమిని కోల్పోతున్నాడు. కూతురు వివాహం కోసం పనికి వస్తుందనుకున్న కోట్ల విలువ చేసే భూము లను కోల్పోయి ఎలా బతకాలని, ప్రభుత్వం అలైన్‌ మెంట్‌ మార్చాలని భద్రయ్య వేడుకుంటున్నాడు.  

మరిన్ని వార్తలు