ఖజానాకు రుణగండం!

18 May, 2022 01:49 IST|Sakshi

బహిరంగ మార్కెట్‌లో తెలంగాణ రుణాలు సమీకరించుకునేందుకు కేంద్రం, ఆర్‌బీఐ ఆంక్షలు

వివక్షను ప్రశ్నిస్తున్నా మారని కేంద్రం తీరు

బాండ్ల వేలంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి అనుమతి నిరాకరించిన ఆర్బీఐ

రూ.3 వేల కోట్లు సమకూర్చుకునే ప్రక్రియకు ఆటంకం

అభివృద్ధి పనులు, పథకాలకు నిధులు సర్దుబాటు చేసేందుకు ఉక్కిరిబిక్కిరి

ఎఫ్‌డీలు ఉపసంహరణ, కోర్టును ఆశ్రయించడంపై నేడు నిర్ణయం!

ఆర్‌బీఐ మంగళవారం నిర్వహించిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేకపోయింది. దీంతో రాష్ట్రం ఆశించిన రూ. 3 వేల కోట్లు రాలేదు. తొలి త్రైమాసికంలో రూ. 8 వేల కోట్ల రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూపాయి కూడా సమకూరలేదు. 

రుణ సమీకరణ జరగక సాధారణ ఖర్చులకు నిధులు కూడా గగనంగా మారింది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులూ ఆర్థిక శాఖకు  కష్టతరమవుతోంది. ఇక ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రుణాలు తీసుకునే విషయంలో కూడా కేంద్రం మెలిక పెట్టడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి రుణ సమీకరణ కష్టంగా మారింది. సాధారణ రెవెన్యూ ఖర్చులతో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రుణాలు సమీకరించుకునేందుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గతంలో లేని ఆంక్షలు, నిబంధనలు విధించడమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి.

2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే ప్రారంభమైన ఈ ఆర్థిక కష్టాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీలు)ను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఆర్థిక శాఖ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక అవసరాల మేరకు ఎఫ్‌డీలను ఉపసంహరించుకున్నా తాత్కాలికంగానే గట్టెక్కనుంది.

రానున్న 10 నెలల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చాలా కష్టతరం కానుంది. దీంతో అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం విధించిన అనవసరపు ఆంక్షల సడలింపు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కేంద్రం వివక్షపై ప్రశ్నిస్తున్నా..
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కూడా ఈ విషయమై ధ్వజమెత్తారు.

రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకుండా ప్రగతికి ప్రతిబంధకాలు వేస్తున్నారంటూ ఆయన అన్ని రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమక్షంలోనే ఆరోపణలు చేశారు. 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్‌ బడ్జెట్‌’అప్పులను (నేరుగా ప్రభుత్వం కాకుండా ప్రభుత్వ గ్యారెంటీతో కా>ర్పొరేషన్లు తీసుకునే రుణాలు) రాష్ట్రాల అప్పులుగానే పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని విమర్శించారు.

వెంటనే రుణసమీకరణకు అనుమతి ఇవ్వాలని ఆ సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఇవే విషయాలను ఉటంకిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయినా కేంద్ర వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొనలేకపోయింది. ఇతర రాష్ట్రాలను వేలానికి అనుమతించిన ఆర్‌బీఐ తెలంగాణను అనుమతించలేదు. 

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి ఎలా తెస్తారు?
మూలధన వ్యయం కింద చేసే ఖర్చు కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందే తప్ప నేరుగా రుణం తీసుకోదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం (జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ) పరిధిలోకి ఎలా తెస్తారని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇలా పరిగణించడం ద్వారా 5 – 6 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు తగ్గిపోతాయని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటోంది.

ఎఫ్‌డీల ఉపసంహరణపై మల్లగుల్లాలు!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొత్త చర్చకు తావిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను వెంటనే తమకు పంపాలని, బ్యాంకుల ఎంప్యానెల్‌మెంట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎఫ్‌డీల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని అన్ని శాఖల అధిపతులకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది.

కొన్ని శాఖల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ నేఫథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ ఉత్తర్వులు వచ్చాయనే అభిప్రాయం ఉన్నా.. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌డీలు ఉపసంహరించుకుంటుందా? అనే చర్చ కూడా ఆర్థిక నిపుణుల్లో జరుగుతోంది.
అయితే ఎఫ్‌డీల ఉపసంహరణ వరకు ప్రభుత్వం వెళ్లకపోవచ్చని, ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని కొందరు ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఎఫ్‌డీలు ఉపసంహరణతో పాటు ఆంక్షల సడలింపు కోసం కోర్టుకు వెళ్లే అంశంపై కూడా ప్రభుత్వం బుధవారం ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  

మరిన్ని వార్తలు