బూరుగిద్దకు భరోసా

22 Dec, 2020 08:29 IST|Sakshi

'సాక్షి’ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం

గ్రామానికి వచ్చిన ఆర్డీవో, తహసీల్దార్‌

ఊరి అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు

గ్రామస్తులకు ఇళ్ల ధ్రువపత్రాలిస్తామని హామీ

లింగంపేట(ఎల్లారెడ్డి) : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బూరుగిద్ద గ్రామాన్ని అక్రమంగా పట్టా చేసుకున్న వివాదంపై ‘సాక్షి’లో సోమవారం ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు రెవెన్యూ యంత్రాంగం కదలివచ్చింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్‌ నాయక్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సర్వేయర్‌ను గ్రామానికి పంపి కొలతలు తీయించారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌నాయక్‌ బూరుగిద్ద గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. 

అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు
అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ధ్రువపత్రాలను రద్దు చేస్తున్నామని ఆర్డీవో వెల్లడించారు. గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన భరోసా ఇచ్చారు. 311 సర్వే నంబరులో 29 గుంటల భూమి ఉన్న ట్లు రికార్డులో ఉన్నందున తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిపారు. మోకా మీద ఇళ్లు ఉన్న ట్లు రికార్డుల్లో లేదన్నారు. రికార్డులను సరిచేసి, ఆబాది కింద మార్చి 13 కుటుంబాలకు వెంటనే ఇల్లు, స్థలాలకు ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తామన్నారు. అయితే భూమి కొనుగోలు చేసిన వారు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. వారు ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు కలుగజేయబోమని ఒప్పుకున్నట్లు, మళ్లీ ఘర్షణకు వస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీ వో గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

సమగ్ర విచారణ చేయాలి
311 సర్వే నంబరులో 29 గుంటల భూమిని తాము ఎవ్వరికీ అమ్మలేదని పట్టాదారు పేర్కొనడం విశేషం. అలాంటప్పుడు ఇద్దరి పేర్లపైకి అధికారులు పట్టా మార్పిడి ఎలా చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పట్టా మార్పిడి జరిగితే గ్రామానికి ఉన్న హద్దులు తప్పుగా నమోదు చేయడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ నారాయణ ఉన్నారు. 

మరిన్ని వార్తలు