తారాజువ్వలా ఎగిరిన రియల్‌ ఎస్టేట్‌

13 Apr, 2021 01:40 IST|Sakshi

మూడు నెలల్లోనే తారాజువ్వలా ఎగిరిన స్థిరాస్తి రంగం

రాజధాని శివార్లలో భారీ ఎత్తున రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు

జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కిక్కిరిసిన కార్యాలయాలు

ఏడాదిలో 2.7 లక్షల లావాదేవీలు జరిగితే చివరి మూడు నెలల్లో 1.46 లక్షల లావాదేవీలు

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో సగం శివారు కార్యాలయాల నుంచే

రంగారెడ్డి ఫస్ట్, మేడ్చల్‌ నెక్ట్స్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి ప్రతిపాదనలు, అభివృద్ధితో పెరిగిన లావాదేవీలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో నేలచూపులు చూసి కుదేలైన స్థిరాస్తి రంగం మూడు నెలల్లోనే తిరిగి తారాజువ్వలా పైకిలేచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర శివార్లలో పెద్ద ఎత్తున పుంజుకున్న రియల్‌ వ్యాపారాల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు నమోదయ్యాయి.

రంగారెడ్డి, మేడ్చల్‌ రిజిస్ట్రేషన్‌ జిల్లాల పరిధిలో ఏడాది కాలంలో జరిగిన కార్యకలాపాల్లో సగం మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరగడం విశేషం. ముఖ్యంగా శివార్లలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో పోటెత్తాయి. భూమిపై పెట్టుబడిని ఆదాయ వనరుగా మధ్యతరగతి వర్గాలు భావిస్తుండడంతో పాటు రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) లాంటి ప్రతిపాదనలు, కరోనా వైరస్‌ నేర్పిన పాఠంతో కాంక్రీట్‌ జంగిల్‌ను వదిలి ప్రశాంతత కోసం శివార్లలోని విల్లాలు, ఫామ్‌ హౌస్‌ల వైపు సంపన్నులు మొగ్గు చూపుతుండడం ఇందుకు కారణాలని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

రంగారెడ్డిలో అత్యధిక లావాదేవీలు
రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో సగం కంటే ఎక్కువగా రూ.2,503 కోట్ల వరకు రంగారెడ్డి,  మేడ్చల్‌ రిజిస్ట్రేషన్‌ జిల్లాల నుంచే రావడం గమనార్హం. ఇక, ఈ రెండు జిల్లాల పరిధిలో జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తే రంగారెడ్డిæ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో 1.7లక్షల లావాదేవీలు జరిగితే చివరి మూడు నెలల్లో 88 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో లక్షకు పైగా డాక్యుమెంట్లు నమోదు కాగా, మూడు నెలల్లో 58 వేలకు పైగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు జరగడం విశేషం.

ట్రిపుల్‌ ఆర్‌ ‘భూమ్‌’
నగరాన్ని చుట్టుముట్టి 340 కిలోమీటర్లకు పైగా ఏర్పాటు కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతిపాదనలు ఒక్క సారిగా స్థిరాస్తి రంగ స్వరూపాన్ని మార్చివేశాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ఏడు జిల్లాల్లో ఈ రహదారి ఏర్పాటవుతుందన్న అంచనాతో శివార్లలో రియల్‌ కార్యకలాపాలు గత రెండు నెలలుగా జోరందుకున్నాయి. భూముల ధరలు అమాంతం పెంచేసినా, భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న భూముల కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. ఈ ట్రిపుల్‌ ఆర్‌ ఏర్పాటు పూర్తయితే దీని చుట్టూ పారిశ్రామికాభివద్ధి జరుగుతుందని, రానున్న ఐదారేళ్లలో భూములకు మరింత డిమాండ్‌ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు నగర శివార్లలో లగ్జరీ విల్లాలపై కూడా సంపన్న వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ గల విల్లాల కొనుగోలుపై వ్యాపారవేత్తలు, ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గండిపేట, గోపన్‌పల్లి, నార్సింగి, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో విల్లాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది. 

ఊతమిస్తున్న అభివృద్ధి
ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కూడా రియల్‌ రంగానికి కొత్త ఊపు తెస్తోంది. ముఖ్యంగా ఐటీ అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణ, నగరానికి దగ్గర్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి, వరంగల్‌–హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్, బెంగళూరు జాతీయ రహదారిపై ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ క్లస్టర్, లాజిస్టిక్‌ హబ్‌లు లాంటివి ఏర్పాటవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విరివిగా వెంచర్లు, టౌ¯న్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నారు రియల్‌ వ్యాపారులు. భారీ బహుళ జాతి సంస్థలు కూడా తమ కార్యాలయాలను గ్రేటర్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండడంతో నివాస ప్రాంతాల కోసం నగర శివార్లలో పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. దీంతో భూములు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు, రిసార్టుల క్రయ విక్రయ లావాదేవీలు భారీ ఎత్తున పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు నగర శివార్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి.

దీనికి తోడు కోవిడ్‌ మొదటి దశ తర్వాత మధ్యతరగతి వర్గాలు సొంత ఇళ్లను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.శివార్లలోని ఉప్పల్, మేడ్చల్, ఘట్‌కేసర్, పోచారం, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, మహేశ్వరం, ఆదిభట్ల, బడంగ్‌పేట్, మణికొండ, శంకరపల్లి, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు