ఫార్మాసిటీతో రియల్‌ బూమ్‌: వాటికి డిమాండ్‌

28 May, 2022 13:00 IST|Sakshi

ఫార్మాసిటీతో రియల్‌ బూమ్‌

ఓపెన్‌ ప్లాట్లు, విల్లా  ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌

కడ్తాల్, ఆమన్‌గల్, కందుకూరు ప్రాంతాలలో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ, ఫ్యాబ్‌ సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లతో శ్రీశైలం జాతీయ రహదారి రూపురేఖలే మారిపోయాయి. ఫార్మా సిటీ నుంచి కూతవేటు దూరంలో ఉన్న కడ్తాల్, కందుకూరు, ఆమన్‌గల్, తలకొండపల్లి వంటి ప్రాంతాలు రెసిడెన్షియల్‌ హబ్‌గా మారిపోయాయి. విజయవాడ, బెంగళూరు, వరంగల్‌ జాతీయ రహదారులతో పోలిస్తే శ్రీశైలం హైవేలోని గృహ అద్దెలకు, స్థలాలకు రెట్టింపు విలువ చేకూరుతుంది.  హైదరాబాద్‌ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరంగల్‌ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్‌పేట్, శంకర్‌పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతం ఏమైనా ఉందంటే అది ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే. 

హాట్‌స్పాట్స్‌ ప్రాంతాలివే.. 
శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రోడ్‌ ఫేసింగ్‌ను బట్టి రూ.8 వేల నుంచి 30 వేల వరకున్నాయి. ప్రధా న నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

లే అవుట్లు, విల్లాలకు డిమాండ్‌.. 
శ్రీశైలం రహదారిలో అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. హాల్‌మార్క్, ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై, విశాల్‌ ప్రాజెక్ట్స్, రాంకీ, హస్తినా రియల్టీ, మ్యాక్‌ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్, జేఎస్‌ఆర్‌ గ్రూప్‌ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్‌ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ. దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్‌ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. 
 

ఫార్మా సిటీ  చుట్టూ అభివృద్ధి.. 
ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్‌పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్‌ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్‌ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం రహదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లున్నాయి. 

మరిన్ని వార్తలు