Krishnam Raju: రారాజు ఇకలేరు

12 Sep, 2022 01:20 IST|Sakshi

పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో నెలరోజులుగా ఆస్పత్రిలో కృష్ణంరాజు

చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూత

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు, తరలివచ్చిన ప్రముఖులు

సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌

నేడు మొయినాబాద్‌ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నిరూపించుకున్న పరిపూర్ణ నటుడు. తెరపై చేసిన శక్తిమంతమైన పాత్రలతో ‘రెబల్‌ స్టార్‌’ అనిపించుకున్నారు. ఈ వెండితెర ‘భక్త కన్నప్ప’ శివైక్యం పొందారు. అయితే చేసిన సినిమాల ద్వారా, మంచి పనుల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు కృష్ణంరాజు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు. ఆ తర్వాత ఫొటోగ్రఫీ అంటే ఇష్టంతో హైదరాబాద్‌లో స్టూడియో ఆరంభించారు. అంతకుముందు జర్నలిస్ట్‌గానూ చేశారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేనప్పటికీ వచ్చిన అవకాశం కాదనలేక ‘చిలకా గోరింక’తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, సపోర్టింగ్‌ యాక్టర్‌గా, హీరోగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. ఈ ‘వెండితెర రారాజు’ అనారోగ్యం కారణంగా ఆదివారం తుదిశ్వాస విడిచారు. 

సాక్షి, హైదరాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌:  కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 27లోని స్వగృహానికి తరలించి సందర్శనార్థం ఉంచారు. 

నెల రోజులుగా వెంటిలేటర్‌పై.. 
కృష్ణంరాజు (83) కొంతకాలం నుంచి మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గతేడాది రక్తనాళాల్లో అడ్డంకులతో వచ్చే పెరిఫెరల్‌ వాస్క్యులర్‌ వ్యాధి కారణంగా కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఏడాదిన్నర కింద కోవిడ్‌ సోకిన అనంతరం న్యుమోనియా, ఇన్ఫెక్టివ్‌ బ్రాంకైటిస్, కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఆరోగ్యం మరింతగా దెబ్బతినడంతో ఈ ఏడాది ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కృష్ణంరాజు దాదాపు నెల రోజులుగా వెంటిలేటర్‌ సపోర్టుతోనే ఉన్నారని.. ఆరోగ్యం విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే సినీ నటుడు ప్రభాస్‌. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే ప్రభాస్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి వద్ద ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. 

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు  
కృష్ణంరాజు భౌతికకాయాన్ని పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సందర్శించి నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్‌ కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, వెంకటేశ్, మోహన్‌బాబు, మురళీమోహన్, కోదండ రామిరెడ్డి, సి.కల్యాణ్, మంచు మనోజ్, దిల్‌రాజు, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, ప్రశాంత్‌ నీల్, వంశీ పైడిపల్లి, కీరవాణి, రాజు సుందరం, విజయ్‌ దేవరకొండ, నాని, గోపీచంద్, నరేశ్‌తోపాటు మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ తదితరులు నివాళులు అర్పించారు. 

నేడు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు 
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. కృష్ణంరాజు సుమారు నాలుగేళ్ల క్రితం కనకమామిడి 3.25 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అందులో భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఏర్పాట్లతోపాటు అక్కడి వెళ్లే రహదారులను సిద్ధం చేస్తున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరుకానున్నారు.

కృష్ణంరాజు మరణం కలచివేసింది
బీజేపీ సీనియర్‌ నేత, సినీ నటుడు కృష్ణంరాజు మరణం కలచివేసింది. రాబోయే తరాలు కృష్ణంరాజు నటనా కౌశలాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలోనూ ముందున్న ఆయన రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి.. 
– ప్రధాని నరేంద్ర మోదీ 

కృష్ణంరాజు సేవలు చిరస్మరణీయం 
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. 
– ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ఇవీ చదవండి: కృష్ణంరాజుగారు నాకు పెద్ద బహుమతి

రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు సినీ జ్ఞాపకాలు ( ఫొటోలు)

కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫొటోలు)

మరిన్ని వార్తలు