దసరా నాటికి ‘యాదాద్రి’

21 Aug, 2021 00:36 IST|Sakshi

ఆ రోజున ఆలయ ప్రారంభానికి వీలుగా ఏర్పాట్లు 

చినజీయర్‌ స్వామితో చర్చించి ముహూర్తం ఖరారు చేయనున్న సీఎం కేసీఆర్‌ 

ఒకవేళ కుదరకుంటే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి ఈ దసరా నాటికి ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నచిన్న పనులు మినహా ఇప్పటికే గుట్టపై నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చాయి. గుట్ట దిగువన కొన్ని ప్రధాన పనులు తుదిదశలో ఉన్నా యి. వీటిని అక్టోబర్‌ చివరి నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. దసరాకు ప్రారంభించే విషయంలో సీఎం స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చినజీయర్‌ స్వామితో చర్చించి ప్రారంభ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ దసరాకు ప్రారంభించడం కుదరకపోతే.. వచ్చే ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభోత్సవాన్ని చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

దాదాపు పనులన్నీ పూర్తి.. 
యాదగిరిగుట్టపై ఆలయ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. క్యూ కాంప్లెక్స్‌ వెలుపలి భాగానికి సంబంధించిన కొన్ని పనులు కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ వాటిని పూర్తి చేయను న్నారు. గుట్టపైన ఉన్న పుష్కరిణి పనులు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దిగువన పుష్కరిణి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రధాన ఆలయం పక్కనే ఉన్న శివాలయంలో ఒక ప్రాకారం నిర్మించాల్సి ఉంది. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్న విద్యుద్దీపాల ఏర్పాటు కూడా పదిరోజుల్లో పూర్తి కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. దిగువన కల్యాణకట్ట రెండు నెలల్లో సిద్ధమవుతుందని అంచనా. 

నిత్యాన్నదాన భవనం పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. పనులు చేపట్టేందుకు ఓ దాత ముందుకొచ్చారు. పూర్తవటానికి కొంత సమ యం పట్టనుంది. ఊ గండిచెరువు వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రెసిడెన్షియల్‌ విల్లాతోపాటు వీఐపీ కాటేజీలు సిద్ధమయ్యాయి. 

గుట్ట దిగువన వ్రత మండపం సిద్ధమయ్యేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే గుట్టపై ప్రత్యామ్నాయ మండపం ఉన్నందున భక్తులకు పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఊ ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మిస్తున్నందున చాలా జాగ్రత్తగా పనులు జరపాల్సి ఉంటుందని, అదే జాప్యానికి కారణమని పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు