ఆ మాష్టారు కిడ్నీలో 156 రాళ్లు!

17 Dec, 2021 05:25 IST|Sakshi

బంజారాహిల్స్‌: దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్‌ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్‌ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. 

గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి యూరాలజిస్ట్, ఎండీ డాక్టర్‌ వి.చంద్రమోహన్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని హుబ్లికి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బసవరాజు కడుపు నొప్పి రావడంతో పరీక్షలు నిర్వహించడంతో కిడ్నీల్లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు బదులుగా కడుపు దగ్గరలో ఉందని దీన్ని ఎక్టోపిక్‌ కిడ్నీ అంటారని డాక్టర్‌ చంద్రమోహన్‌ పేర్కొన్నారు. 

ఇలాంటి చోట కిడ్నీలోని రాళ్లను తీయడం చాలా పెద్ద ప్రయత్నమేనని అయితే శరీరంపై పెద్ద కోతకు బదులు కేవలం కీహోల్‌ మాత్రమే చేసి తీసేశామని ఆయన వివరించారు. ఈ రోగికి రెండేళ్లకు ముందే రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుందని అయితే ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఉన్నట్టుండి నొప్పి రావడంతో పరీక్షలు చేయిచుకున్నారని అన్నారు. 

మరిన్ని వార్తలు