టన్ను బత్తాయి ధర.. రూ. లక్ష

12 Jun, 2021 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభ సమయంలో డిమాండ్‌ పెరగడంతో బత్తాయికి రికార్డు స్థాయిలో ధర లభించింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలుకుతోంది. సామాన్యులు మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే కిలో బత్తాయి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. విటమిన్‌–సి పుష్కలంగా ఉండడంతో డాక్టర్లు కోవిడ్‌ పేషెంట్లను బత్తాయి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది బత్తాయి పండ్లను కొనుగోలు చేస్తున్నారు.

రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌ కొత్తపేట్‌లో శుక్రవారం గతంలో ఎన్నడూలేని విధంగా టన్ను లక్ష రూపాయలు పలికింది. మరోవైపు రోజు మార్కెట్‌కు 800 టన్నుల బత్తాయి దిగుబడి రావాలి. కానీ గత నెల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కేవలం 300 టన్నుల బత్తాయి మాత్రమే మార్కెట్‌కు దిగుమతి అవుతోందని మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి.   కరోనా కాలంలో కొత్తపేట పండ్ల మార్కెట్‌ నుంచి బత్తాయి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. 

మార్కెట్‌ చరిత్రలోనే అత్యధిక ధర 
టన్ను బత్తాయి ధర రూ.లక్ష పలకడం కొత్తపేట మార్కెట్‌ చరిత్రలోనే రికార్డు. కోవిడ్‌ నేపథ్యంలో బత్తాయి వినియోగం దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి మార్కెట్‌ నుంచే ఎగుమతులు అవుతాయి. ఈ ఏడాది బత్తాయి పూత సమయంలో వర్షాలతో పూత రాలి దిగుబడి తగ్గింది. దీంతో కూడా డిమాండ్‌కు మేర సరుకు లేక ధర పెరిగింది. – సయ్యద్‌ అఫ్సర్, హోల్‌సేల్‌ వ్యాపారి, కొత్తపేట
చదవండి: 
అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?

మరిన్ని వార్తలు