Cyclone Gulab: తెలంగాణలోని 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

27 Sep, 2021 20:22 IST|Sakshi

హైదరాబాద్‌లో భారీ వర్షం: నేడు, రేపు హై అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. సుమారు మధ్యాహ్నం 2 గంటల నుంచి మోస్తరు వర్షం, సాయంత్రం 4 గంటల నుంచి  అత్యంత భారీ వర్షం కురిసింది. రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉన్న కారణంగా జీహెచ్ఎంసి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. మరో 12 గంటల పాటు గులాబ్ తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో అయిదారు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

హైదరాబాద్‌ హై అలర్ట్‌
హైదరాబాదీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నేడు, రేపు హై అలర్ట్‌ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. అవసరమైతే  040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు