పసిడితో మిర్చి పోటీ.. క్వింటాల్ రూ. 52 వేలు.. దేశవ్యాప్తంగా ఆల్‌లైమ్‌ రికార్డు!

31 Mar, 2022 15:43 IST|Sakshi
వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన మిర్చి బస్తాలు 

దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.52వేలు

ఇది ఆల్‌టైమ్‌ రికార్డు అంటున్న ఏనుమాముల మార్కెట్‌ అధికారులు

వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గడమే రేటు పెరిగేందుకు కారణం

పత్తికి సైతం క్వింటాకు రూ.11,690 పలికిన రేటు

సాక్షి, వరంగల్‌: మిర్చి పంట బంగారమైంది.. పసిడి రేటును తలదన్నింది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గడం.. ప్రస్తుత సీజన్‌లో పచ్చళ్లలో ఎక్కువగా దేశీ రకం మిర్చి కారాన్ని వినియోగిస్తుండటం కూడా రేటు పెరిగేందుకు కారణమైంది. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల(తులం) బంగారం ధర రూ.51,989 ఉంటే.. మరో రూ.11 అదనంగా దేశీ మిర్చి రేటు పలికింది. వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ధర రూ.52వేలు అత్యధికంగా పలకడం విశేషం.

రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఆల్‌లైమ్‌ రికార్డు అని మార్కెట్‌ అధికారులు చెబుతున్నా.. మిర్చి దిగుబడి తగ్గడమే ఈసారి రేట్లు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు.. అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా తామర తెగులుతో వేలాది ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోయింది. దీంతో దిగుబడి తగ్గడంతో రైతులకు వచ్చిన పంటలో నాణ్యత ఉన్న మిర్చికి మాత్రమే అత్యధిక ధర పలుకుతోంది.

ఇదే కాస్త ఉపశమనంగా మారిందని ఇటు అధికారులు, అటు రైతులు చెబుతున్నారు. అయితే బుధవారం ఏనుమాముల మార్కెట్‌లోని మిర్చి యార్డుకు 30వేల బస్తాలు వస్తే.. ఇందులో దేశీ మిర్చి రకం 800 బస్తాల వరకు ఉంది. ఇందులో అత్యధిక నాణ్యత ఉన్న ములుగు జిల్లా ఎస్‌ నగర్‌కు చెందిన బలుగూరి రాజేశ్వర్‌రావు తెచ్చిన ఏడు బస్తాల మిర్చికి క్వింటాల్‌కు రూ.52వేల ధర పెట్టి ఖరీదుదారు లాలా ట్రేడింగ్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక మిగిలిన రకాల మిర్చికి రూ.18వేల నుంచి రూ.35వేల వరకు ధర పలికింది.

ఎందుకింత డిమాండ్‌ అంటే..
‘దేశీ రకం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గింది. అకాల వర్షాలు, తామర తెగులుతో దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడం.. ఇప్పుడు సీజన్‌ కూడా కావడంతో ఉన్న కొద్దిపాటి పంటకు అత్యధిక ధర పలుకుతోంది. నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారులు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంత రేటు వచ్చినా ఇది రైతులకు కంటి తుడుపు చర్య మాదిరిగానే ఉంది.

ఎందుకంటే.. వారు రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాకపోవడంతో ఉన్న కొంత సరుకుకు ఈ ధర వస్తోంది. పెట్టుబడి కూడా పూర్తిగా రావడం లేదని మార్కెట్‌కు వచ్చిన రైతులు వాపోతున్నారు. గతంలో దేశీ మిర్చి క్వింటా ధర రూ.28వేలు పలికింది. ఇప్పుడది రూ.52వేలతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది’ అని మార్కెట్‌ గ్రేడ్‌ కార్యదర్శి రాహుల్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

రెండెకరాలు.. రెండు క్వింటాళ్లపైనే..
మాకున్న రెండెకరాల్లో ఏటా మిర్చి పంట సాగు చేస్తున్నా. అంతకుముందు ఎకరానికి 10 క్వింటాళ్లపైగా దిగుబడి వచ్చేది. ఈసారి ఎకరాకు కొంచెం ఎక్కువగా వచ్చింది. తామర తెగులుతో పంట దిగుబడి తగ్గింది. ఈసారి పెట్టుబడి రూ.5లక్షలు పెడితే.. కేవలం రూ.1,70,000 మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.3,30,000 వరకు నష్టపోయాం. ఇంత అత్యధిక ధర రూ.52వేలు వచ్చినా పెద్దగా మాకు వచ్చిన ప్రయోజనమేమీ లేదు. 
 బలుగూరి రాజేశ్వర్‌రావు, మిర్చి రైతు, ఎస్‌ నగర్, ములుగు జిల్లా 

మరిన్ని వార్తలు