తెలంగాణలో పురోగతి.. ప్రతి వెయ్యికి 23 మంది

29 Oct, 2021 04:56 IST|Sakshi

2014తో పోలిస్తే రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల రేటు 

35 నుంచి 23కు తగ్గుదల 

ఆడ శిశువుల్లో 22.. మగ శిశువుల్లో 24 మంది 

పల్లెల్లో 26 మరణాలు..పట్టణాల్లో 18 మంది 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కారణంగానే ఈ పురోగతి కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 2019లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) సర్వే నిర్వహించి తాజాగా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి.

ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 30 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 23 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది చనిపోయేవారని ఎస్‌ఆర్‌ఎస్‌ వెల్లడించింది. 1971లో దేశంలో శిశు మరణాల రేటు 129 ఉండేది. 21 పెద్ద రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల రేటు అత్యంత తక్కువగా కేరళలో ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు.

అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 46 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాం, నాగాలాండ్‌లో ప్రతి మందికి ముగ్గురు చొప్పున శిశువులు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మేఘాలయలో 33 మంది మరణిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత తక్కువగా అండమాన్‌ అండ్‌ నికోబార్‌లో ఏడుగురు మరణిస్తుండగా, అత్యంత ఎక్కువగా డామన్, డయ్యూలో 17 మంది శిశువులు మరణిస్తున్నారు. 

పల్లెల్లో అధికంగా శిశు మరణాల రేటు.. 
రాష్ట్రంలో మగ శిశు మరణాల రేటు 24, ఆడ శిశువుల మరణాల రేటు 22గా ఉంది. పట్టణాల్లో శిశు మరణాల రేటు 18 ఉండగా, పల్లెల్లో 26 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో మరణించే శిశువుల్లో 27 మంది మగ శిశువులు, 25 మంది ఆడ శిశువులు ఉన్నారు. పట్టణాల్లో మరణించే శిశువుల్లో 18 మంది మగ, 19 మంది ఆడ శిశువులు ఉన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటులో గ్రామాలకు, పట్టణాలకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది.

ఈ తేడాకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదో అర్ధ రాత్రి గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లే దిక్కుండదు. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే సరికి శిశు మరణాలు సంభవిస్తున్నాయన్న భావన నెలకొని ఉంది. సమీప పట్టణాలకు తీసుకెళ్లాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది.

ఇక గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. పట్టణాలు, నగరాల్లోనైతే వైద్య వసతి అధికంగా ఉండటం వల్ల ఇక్కడ శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ప్రసవ సమయంలో తక్షణమే స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటేనే శిశు మరణాల రేటు తక్కువగా నమోదు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

తగ్గుదలకు కారణాలివే.. 
తెలంగాణలో శిశు మరణాలు గతం కంటే తగ్గడానికి ప్రధాన కారణం ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడమేనని చెబుతున్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం, ఆసుపత్రుల్లో శిశు మరణాలు పెరగకుండా ప్రత్యేకమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడమేనని పేర్కొంటున్నారు. కేసీఆర్‌ కిట్‌ను ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు ప్రోత్సాహకం ఇస్తుండటం కూడా శిశు మరణాల రేటు తగ్గుతోందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.   

మరిన్ని వార్తలు