RRR Project: అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు

1 Aug, 2022 03:15 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌లో రెండు చోట్ల అటవీ భూముల గుండా నిర్మాణం

గజ్వేల్, నర్సాపూర్‌ ప్రాంతాల్లో వాటికి ఓ పక్కగా అలైన్‌మెంట్‌ 

235 ఎకరాలను సేకరించాలని తాజాగా నిర్ణయం 

వానలు తగ్గాక ఎన్‌హెచ్‌ఏఐ–అటవీశాఖ సంయుక్త సర్వే 

వన్యప్రాణుల సంచారం ఉన్న చోట్ల ఎకో బ్రిడ్జిల నిర్మాణం 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం జరగనుంది. రీజినల్‌ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికిగాను ఇప్పటికే కొంతభాగానికి భూసేకరణకు వీలుగా గెజిట్‌ విడుదల కావడంతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఈ ఉత్తర భాగానికి ఉన్న నిడివిలో నర్సాపూర్, గజ్వేల్‌ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. ఈ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారైంది. అయితే ఎక్కువ అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండా, ఓ మూల నుంచి రోడ్డు నిర్మాణానికి వీలుగా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఇందుకోసం 235 ఎకరాల అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం ఉందని తాజాగా తేల్చారు. 

వన్యప్రాణుల సంచారంపై పరిశీలన.. 
అటవీ ప్రాంతానికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాల్సి ఉందో తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. దీంతో రెండు విభాగాల అధికారులు సంయుక్త సర్వేకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భారీ వర్షాల వల్ల ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో వానలు తగ్గాక సర్వే చేపట్టి హద్దులు గుర్తించనున్నారు. అటవీ ప్రాంతం మీదుగా రీజినల్‌ రింగురోడ్డు ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరుగుతున్నందున దాని ప్రభావం వన్యప్రాణులపై ఎంత మేర ఉండనుందో అంచనా వేస్తున్నారు. ఉత్తరభాగం రోడ్డు అలైన్‌మెంట్‌లో గజ్వేల్, నర్సాపూర్‌ ప్రాంతాల్లోనే అటవీ భూములున్నాయి.

ఈ రెండు ప్రాంతాలకు కలిపి 235 ఎకరాల మేర రోడ్డు నిర్మాణానికి వాడనున్నారు. ఆ ప్రాంతాల్లో అడవి రోడ్డుకు ఓవైపు సింహభాగం ఉండనుండగా మరోవైపు కొంత ప్రాంతమే ఉండనుంది. అయినా అటూఇటూ వణ్యప్రాణుల రాకపోకలు ఎలా ఉండనున్నాయనే విషయమై అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో అరుదైన వణ్యప్రాణులు పెద్దగా లేవు. కోతులు, జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్ల లాంటి సాధారణమైన అడవి జంతువులే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వాటిల్లోనూ ఎక్కువ రాకపోకలుండే ప్రాంతాలను గుర్తించి ఆ వివరాలను అటవీ శాఖ అధికారులు ఎన్‌హెచ్‌ఏఐకి అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాటి రాకపోకలకు వీలుగా ఎకో బ్రిడ్జీలు నిర్మించే అవకాశం ఉంది. 

సామాజిక అటవీ వృద్ధికి విఘాతం.. 
రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిస్తున్న ప్రాంతాల్లో దట్టమైన అడవులంటూ లేవు. తక్కువ పరిధిలోనే ఓ మోస్తరు అటవీ ప్రాంతాలుండగా కొన్నిచోట్ల సామాజిక అటవీ ప్రాంతాలను వృద్ధి చేశారు. ఈ పరిధి కూడా తక్కువ ప్రాంతాల్లోనే ఉంది. తాజాగా రింగురోడ్డు నిర్మాణంతో నాలుగైదు ప్రాంతాల్లో ఈ సామాజిక అటవీ ప్రాంతాల వృద్ధికి విఘాతం కలగనుంది. దీంతో వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాంతాల్లో అలాంటి అడవులను అభివృద్ధి చేయాల్సి ఉంది. అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను అటవీ శాఖకు అందిస్తారో లేక ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో వాటిని పెంచాల్సి ఉందో అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు