RRR: ఇంటర్‌ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ! అనుబంధ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల

10 Sep, 2022 03:48 IST|Sakshi

మరో 40 ఎకరాల కోసం అనుబంధ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ!

మరో రెండు నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు

జంక్షన్లు అత్యంత విశాలంగా నిర్మించేందుకే..

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌­ఆర్‌)కు సంబంధించి అదనంగా మరో 40 ఎకరాల భూసేకరణకు ఎన్‌హెచ్‌ఏఐ అనుబంధ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు సమాచారం. గత ఏ­ప్రిల్‌లో సంగారెడ్డి జిల్లా ఆందోల్‌–జోగిపేట ఆర్డీ­ఓ పరిధిలో 270 ఎకరాల భూసేకరణకు కీలకమైన 3ఏ గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఢిల్లీ అధి­కా­రులు జారీ చేశారు. ఇప్పుడు దానికి మరో 40 ఎక­రా­లను చేర్చినట్లు సమాచారం. ఇలాగే మ­రో రెండు అనుబంధ నోటిఫికేషన్లను విడుదల చే­సేందు­కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

గత నోటిఫికేషన్లకు అనుబంధంగా..
ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌ ఛేంజర్లను విశాలంగా నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించి భూసేకరణకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే ప్రాంతాల్లో ఇంటర్‌ ఛేంజ్‌ జంక్షన్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే జంక్షన్ల వద్ద వాహనాల వేగం కనీసం 60 కి.మీ. మేర ఉండేందుకు ఇంటర్‌ ఛేంజర్లను విశాలంగా నిర్మించాలని నిర్ణయించింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి 158.64 కి.మీ నిడివిగల రోడ్డుకు 8 భాగాలుగా భూసేకరణ జరపనున్న విషయం తెలిసిందే. ఇందులో మూడు భాగాలకు సంబంధించి గత ఏప్రిల్‌లో 3ఏ గెజిట్‌ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆందోల్‌–జోగిపేట ఆర్డీఓ, చౌటుప్పల్‌ ఆర్డీఓ, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌ పరిధిలో సేకరించాల్సిన భూమి వివరాలతో ఈ నోటి­ఫి­కే­షన్లు జారీ అయ్యాయి.

ఇప్పుడు వాటికి అనుబంధ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ కానున్నట్టు తెలిసింది. ఉత్తరభాగానికి సంబంధించి 11 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌ జంక్షన్లు నిర్మితం కానున్నాయి. ఇందుకోసం అధికారులు రెండు డిజైన్లు రూపొందించారు. మొదటిది వాహనాలు గంటకు 30 కి.మీ వేగంతో, రెండోది 60 కి.మీ.వేగంతో వెళ్లేలా డిజైన్‌ చేశారు. భూసేకరణకు సంబంధించి మొదటి మూడు గెజిట్‌ నోటిఫికేషన్లను తొలి డిజైన్‌కు సరిపోయేలానే జారీ చేశారు. కానీ ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో గంటకు 60 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తర్వాత ఖరారు చేశారు.

ఈ కారణంగానే గత నెలలో విడుదలైన మిగతా ఐదు గెజిట్‌ నోటిఫికేషన్లలో రెండో డిజైన్‌కు సరిపోయేలా భూమిని గుర్తిస్తూ విడుదల చేశారు. ఇప్పుడు మొదటి మూడు గెజిట్‌ నోటిఫికేషన్లకు సంబంధించి మిగతా భూమిని చేరుస్తూ అదనపు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆందోల్‌–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివంపేట గ్రామంలో అదనంగా 40 ఎకరాలు సేకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు