విదేశీ వైద్య విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌

30 Jul, 2022 02:52 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా వల్ల ఇండియాకొచ్చిన వారికి వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధం కారణంగా చదువు చివరి సంవత్సరంలో ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌ 30 కన్నా ముందు మెడిసిన్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీచేసింది. ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష (ఎఫ్‌ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే వారు ఆ దేశంలో భౌతికంగా తరగతులకు హాజరుకానందున, ఎఫ్‌ఎంజీఈలో అర్హత సాధించాక వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ (సీఆర్‌ఎంఐ) చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా లేదా ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా చాలా మంది వైద్య విద్యార్థులు మెడిసిన్‌ పూర్తి చేయకుండా ఫైనల్‌ ఇయర్‌లోనే తిరిగొచ్చారు.

వారు ఎలాంటి ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకోలేదు. దీంతో సీఆర్‌ఎంఐని రెండేళ్లు తప్పనిసరి చేసింది. ఆ తర్వాత వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అర్హులవుతారు. అనంతరం ఎక్కడైనా ప్రాక్టీస్‌ గానీ, ఏవైనా ఆస్పత్రుల్లో పనిచేయడానికి గానీ వీలు కలుగుతుంది. కాగా, కేంద్రం ఈ వెసులుబాటును ఈ ఏడాది వరకే కల్పించినట్లు ఎన్‌ఎంసీ స్పష్టంచేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి 20 వేల మంది మెడికల్‌ విద్యార్థులు ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అందులో చివరి ఏడాది చదువుతున్న వారు 4 వేల మంది వరకు ఉంటారని అంచనా. వారందరికీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటు ప్రయోజనం కలగనుంది.  

మరిన్ని వార్తలు