టైమ్‌ 11 దాటినా పత్తాలేని తహసీల్దార్..

31 Mar, 2021 14:51 IST|Sakshi
తహసీల్దార్‌ కోసం వేచి చూస్తున్న రైతులు.. (ఇన్‌సెట్‌) ఉదయం 11గంటలకు ఖాళీగా కుర్చీ

తరచూ ఇదేతంతు అంటున్న రైతులు 

సాక్షి, మెదక్ : పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా మంచిపేరు రావాలంటే అధికారుల కృషి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం తరచూ సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన రేగోడ్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్, ఒక వీఆర్‌ఏ మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అక్కడే తహసీల్దార్‌ కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెల్లి చూడగా తహసీల్దార్‌తో పాటు పలువురు అందుబాటులో లేరు. తరచూ సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోయారు.

గతంలో అధికారుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా వేలరూపాయలు వేతనం తీసుకుంటున్నా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూమి మార్పు విషయంలో అడిగిన డబ్బులు ఇచ్చినా ఓ అధికారి, వీఆర్‌ఓ పనిచేయకుండా తిప్పించుకుంటున్నారని మర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మారుమూల మండలంలోని రేగోడ్‌పై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి వెల్లే సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను పట్టించుకోకపోవడం ఏమిటోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి తగిన చర్యలు తీసుకోని ఇబ్బందులు తప్పించాలని  పలువురు కోరుతున్నారు.

చదవండి:
ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్‌‌
జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్‌చల్‌‌

రెండేళ్లుగా తిరుగుతున్నా 
మా తాత పేరున ఉన్న 133అ సర్వే నంబరులో ఎకరా మూడుగుంటలనర భూమికి తొమ్మిది గుంటలు భూమి మాత్రమే ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. మిగతా భుమిని ఆన్‌లైన్‌లో పెట్టాలని అధికారులను తరచూ కోరుతున్నా. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, వీఆర్‌ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదని, మా తాతపేరుపై ఉన్న భూమిని మా నాన్న పేరున చేయడం లేదు. రోజూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా.    
– అనిల్, మర్పల్లి 

ఫిర్యాదు చేసినా మారడం లేదు 
తహసీల్దార్‌తో పాటు సిబ్బంది సమయానికి రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా అధికారి, సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇక్కడి అధికారుల తీరువల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  
– నాగయ్య స్వామి, సిందోల్‌   

ఒక్కోసారి ఆలస్యం అవుతుంది.. 
ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ముందుగానే వస్తున్నాం. ఆఫీసుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తున్నాం
– సత్యనారాయణ, తహసీల్దార్‌  

మరిన్ని వార్తలు