కరోనాలో రిస్క్‌ తగ్గాలంటే... ఒళ్లు కదల్చండి..! 

24 Jun, 2021 02:06 IST|Sakshi

ఒళ్లు కదల్చని బద్దకం... వేళపాళ లేని తిండి..  కంటికి కరవైన కునుకు... ఆధునిక జీవనశైలి తాలూకూ మూడు ప్రధాన లక్షణాలివి. ఈ అలవాట్లతో మధుమేహం, గుండెజబ్బులు మాత్రమే కాదు..  రోగ నిరోధక శక్తి బలహీనపడి.... కరోనా మహమ్మారి బారిన పడే అవకాశాలూ బాగా పెరిగిపోయాయి. కానీ..  కేవలం వ్యాయామం ద్వారా మాత్రమే ఈ సమస్యను ఇట్టే అధిగమించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! శరీరాన్ని చురుకుగా ఉంచడం ఆరోగ్యానికి మేలన్నది కొత్త విషయం ఏమీ కాదు. మనసుకు ఉల్లాసం కల్పించడం... బోలెడన్ని జబ్బులు రాకుం డా నివారించడం వ్యాయామం వల్ల కలిగే కొన్ని లాభాలని కూడా మనం చదువుకునే ఉంటాం. కారణాలేవైనా.. ఈ అంశాన్ని విస్మరించిన ఫలితంగానే చాలామంది కోవిడ్‌ బారిన పడ్డారన్నది కూడా నిష్టూర సత్యం. అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా కోవిడ్‌ బారిన పడ్డా.. సమస్య జటిలం కాకుండా జాగ్రత్త పడవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌’ మెడిసిన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం..   

వారంలో ఎన్ని రోజుల పాటు మీరు ఓ మోస్తరు నుంచి కఠినమైన వ్యాయామం చేస్తారు? నడక, సైక్లింగ్, పరుగు వంటి రకరకాల వ్యాయామాలకు వారంలో ఎంత సమయం కేటాయిస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే.. ఒక వ్యక్తి శారీరకంగా ఎంత చురుకుగా ఉన్నాడన్నది అర్థం చేసుకోవచ్చు. కోవిడ్‌కు, వ్యాయామానికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకునేందుకూ ఈ ప్రశ్నలే ఆధారమయ్యాయి. పద్దెనిమిదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు, కోవిడ్‌ కోరల్లో చిక్కుక్కున్న సుమారు 48 వేల మందికి ఈ ప్రశ్నలే వేసి వారిచ్చిన సమాధానాల ఆధారంగా వ్యాయామానికి, కోవిడ్‌కు ఉన్న లింక్‌ను అంచనా వేశారు శాస్త్రవేత్తలు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో అన్ని ప్రాంతాల వారూ పాల్గొన్నారు.  

మూడుసార్లు వివరాల నమోదు 
దాదాపు పది నెలల అధ్యయన కాలంలో సర్వేలో పాల్గొన్న వారి నుంచి మూడుసార్లు వివరాలు సేకరించారు. వారానికి కనీసం 150 నిమిషాలపాటు ఏదో ఒకరమైన వ్యాయామం తప్పకుండా చేసిన వారు ఒక వర్గంగా పరిగణిస్తే... ఒళ్లు కదల్చకుండా వారానికి పది నిమిషాల కంటే తక్కువ సమయం కష్టపడ్డ వారు ఇంకో వర్గంగా లెక్కించారు. అప్పుడప్పుడు మాత్రమే వ్యాయా మం చేస్తూ వారంలో 11 నుంచి 149 నిమిషాలు దానికి వెచ్చించిన వారు మూడో వర్గమైంది. అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, స్త్రీనా? పురుషుడా?, ఏ ప్రాంతం వారు? ధూమపానం లేదా ఆ అలవాటు కారణంగా వచ్చే దగ్గు ఉందా? ఊబకాయులా? మధుమేహం, రక్త పోటు, గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయా?.. ఇలా అన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించినప్పుడు కోవిడ్‌ వ్యాధి తీవ్రతకు.. వ్యాయామం చేసే సమ యానికి గట్టి సంబంధాలే ఉన్నట్లు స్పష్టమైంది! 

రోజుకు కనీసం అరగంట... 
వారంలో అతితక్కువ సమయం వ్యాయామం చేసే వాళ్లు కోవిడ్‌ కారణంగా ఆసుపత్రిపాలయ్యేందుకు, ఐసీయూలో చేరే స్థాయికి ఆరోగ్యం పతనమయ్యేందుకు,  ఆఖరుకు మరణానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. వారానికి దాదాపు 150 నిమిషాలు అంటే.. వారంలో ఐదు రోజులపాటు అరగంట సేపు వ్యాయామం చేసిన వాళ్లతో పోలిస్తే.. వ్యాయామం చేయని వారి పరిస్థితి ఇదన్నమాట. అప్పుడప్పుడూ వ్యాయామం చేసే వారు కూడా వ్యాధి నుంచి ఒక మోస్తరు రక్షణ పొందారని, కడుపులో చల్ల కదలకుండా ఉన్న వారికే సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే ఎక్కడ, ఎలా వీలైతే అలా శరీరానికి పని చెప్పండి. ఇల్లు శుభ్రం చేయడం మొదలుకొని జిమ్‌లో చేరి బరువులెత్తడం వరకూ ఏదో ఒకదాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా పాటించండి. ఎలాంటి వ్యాయామం చేయాలో తెలియదనుకుంటే.. రోజూ రెండు మూడు కిలోమీటర్లు వేగంగా నడిచినా (బ్రిస్క్‌ వాకింగ్‌) చాలు. ఆపాదమస్తిష్కమూ ప్రయోజనమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యాయామం జిందాబాద్‌ అనేయండి!! 
– సాక్షి, హైదరాబాద్‌. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు