క్రమబద్ధీకరణ పరిశీలన.. పొరుగింటికి..!

23 May, 2022 01:35 IST|Sakshi

జీవో 58, 59 దరఖాస్తులపై రెవెన్యూతో సంబంధంలేని శాఖలకు సిఫారసు బాధ్యతలు 

కొన్ని జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన, మైనార్టీ శాఖల అధికారులకు.. 

కాలపరిమితి లేకుండానే ఉత్తర్వులు     

రెవెన్యూ శాఖ, దరఖాస్తుదారుల్లో ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో నివాసాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఈ దరఖాస్తులను స్థానిక రెవెన్యూ వర్గాలతో కాకుండా రెవెన్యూతో సంబంధం లేని అధికారులతో పరిశీలన జరిపించాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. ప్రతి 250 దరఖాస్తులకు టీమ్‌లు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ వర్గాలే కాకుండా వీలును బట్టి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్లను సర్కారు ఆదేశించింది.

దీంతో కొన్ని జిల్లాల్లో ఇతర శాఖల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగించారు. మరికొన్ని జిల్లాల్లో అసలు రెవెన్యూతో సంబంధం లేని వ్యవసాయం, ఉద్యాన, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో బృందాలను నియమించారు. వీరి నేతృత్వంలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, సర్వేయర్‌లతో కూడిన బృందాలు ఈ దరఖాస్తులను పరిశీలించి  నివేదికలు తమకు పంపాలని కలెక్టర్లు ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల అటు రెవెన్యూ వర్గాలు, ఇటు దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

పరిష్కారం.. పరేషాన్‌! 
గతంలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను స్థానిక తహసీల్దార్‌ నేతృత్వంలో పరిశీలించి సిఫారసు చేస్తే ఆర్డీవోలు పరిష్కరించారని, దీంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూములు లేదా ఇళ్ల క్రమబద్ధీకరణలో రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా ఉంటాయని, రెవెన్యూ చట్టాలపై అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నాయి. ఇప్పుడు రెవెన్యూతో సంబంధం లేని అధికారులు తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యులవుతారని రెవెన్యూ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే తాము చేయని తప్పునకు బాధ్యత వహించాల్సి వస్తుందని వాపోతున్నారు. జీవో 58, 59 దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న నిబంధనలు పూర్తిగా రెవెన్యూతో సంబంధం ఉన్నవే కాబట్టి పూర్తిస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ద్వారానే పరిశీలన జరిపించి పరిష్కరించే బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అంటున్నారు.

ఇక, దరఖాస్తుదారుల్లో సైతం ఈ నిర్ణయం ఆందోళన రేపుతోంది. ప్రభుత్వ భూముల్లో చాలాకాలంగా నివాసం ఉంటున్నందున తమకు ఆ భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారని, తెలిసీ తెలియక రెవెన్యూయేతర అధికారులు తమ దరఖాస్తులను ఏం చేస్తారోనని, అన్యాయం జరిగితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అదీగాక, ఈ దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు ఇచ్చిన ప్రభుత్వం అందులో కనీస కాలపరిమితి విధించలేదు. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని మాత్రమే పేర్కొనడంతో అసలు పరిశీలన ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పటికి ఈ ప్రక్రియ ముగుస్తుందోననే చర్చ జరుగుతోంది.   

మరిన్ని వార్తలు