పెళ్లి వరకు వెళ్లని ప్రేమ..కారణాలు ఎన్నో!

8 Oct, 2022 10:01 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రేమ నేటి యువతకు పరిచయం అక్కర్లేని పదం. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక ఆలోచించే పరపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకోలేక , ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం లేక ప్రియుడు లేదా ప్రియురాలు నిరాకరించడంతో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించి వారిలో స్నేహభావం పెంపొందిస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సినిమాల ప్రభావంతో.. 
సినిమాల ప్రభావం నేటి యువతరం మీద ఎక్కువ ఉంది. ప్రేమ అనే అంశం లేకుండా సినిమాలు ఉండటం లేదు. వీటిని చూసిన యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్‌ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్‌ కాల్, వీడియో కాల్‌తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. సోషల్‌ మీడియా ప్రభావం యువతపై పడుతుంది. 

తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగితే...:
ప్రతి మనిషికి స్నేహితుడి తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. అమ్మా, నాన్నలు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. వారికి కలిగే చిన్నచిన్న సమస్యలను మొదలుకుని ప్రేమ వ్యవహారాల్లో సైతం స్నేహితుడి పాత్ర పోషించాలి. పెద్దలకు తెలియకుండానే ఏమనుకుంటారనో, ఏమైన చేస్తారనేమో భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కొన్ని ఘటనలు:
► బెల్లంపల్లి పట్టణం షంషీర్‌నగర్‌కు చెందిన సోయం తేజశ్రీ నెన్నెల లంబాడితండాకు చెందిన ధరావత్‌ రాజ్‌కుమార్‌ కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఏం చేయాలో తోచక తేజశ్రీ  దసరా పండుగ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
►కుశ్నపల్లికి చెందిన జాడి రవి అనే యువకుడు వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన సత్యశ్రీ అనే ప్రియురాలి మరణవార్త విని నీవు లేనిదే జీవితం వ్యర్థమని భావించి మనస్థాపం చెంది ఈ ఏడాది ఫిబ్రవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
►నెన్నెల మండల కేంద్రానికి చెందిన ఈగం మౌనిక ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్థాపం చెంది 2021, అక్టోబర్‌ 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
►బెల్లంపల్లి పట్టణానికి చెందిన సాజీద్‌ యశ్వంతిక ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో  2021 అక్టోబర్‌ 23న జైపూర్‌ శివారు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
►భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన దొబ్బల కల్పన అనే డిగ్రీ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన కోట మల్లేశ్‌ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి ప్రియుడు నిరాకరించడంతో మనస్తాపం చెంది 2021 డిసెంబర్‌ 26న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.

పేరెంట్స్, టీచర్లు గమనిస్తూ ఉండాలి
పిల్లల ప్రవర్తనను ఇంట్లో తల్లిదండ్రులు, బ డిలో టీచర్లు గమనిస్తూ ఉండాలి. పిల్ల లు తప్పు చేస్తే కొట్ట డం, తిట్టడం చేయకుండా ఓపికతో మాట్లాడి నచ్చజెప్పాలి. యువత చెడుమార్గం వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ చెడు చేస్తే సా మరస్యంగా సమస్యను పరిష్కరించాలి. ప్రే మించుకున్న యువత మొదట తల్లిదండ్రుల మనస్సు గెలుచుకోవాలి. ప్రేమించడంతోపా టు యోగ్యతను సంపాదించాలి. కులం కన్నా ఆర్థిక స్థిరత్వం ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వీలు ఉంటుంది. అనుకున్నది జరగకపోతే తట్టుకునే శక్తి యువతకు ఉండకపోవడంతోనే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.  
– డాక్టర్‌ సునిల్‌కుమార్, మానసిక వైద్య నిపుణులు, మంచిర్యాల

చట్టాలను ఉపయోగించుకోవాలి
చట్టాన్ని ఉపయోగించుకొని హక్కులను సాధించుకోవాలి. పిరి కితనంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఆటలకు దూరం కావడం కూడా ఒక కారణం. ఆటలు ఆడటం ద్వారా గెలుపు, ఓటములను తట్టుకునే శక్తి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచడం ద్వారా ఏది అడిగిన ఇస్తారులే అనే ఆలోచన ధోరణిలో నేటి యువత ఉంది. ముఖ్యంగా యువత సోషల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. బతకడానికి ఎన్నో మార్గాలు, చావడానికి ఒకటే మార్గం. ధైర్యంగా ఉండి ముందుకు నడవాలి.
– రాజశేఖర్, ఎస్సై(నెన్నెల)  

మరిన్ని వార్తలు