యూట్యూబ్‌కు కోర్టు ఆదేశం.. వెల్లడించిన సజ్జనార్‌

6 Dec, 2021 03:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సును కించపరిచేలా సినీ హీరో అల్లు అర్జున్‌తో ఓ యాప్‌ ఆధారిత బైక్‌ టాక్సీ అగ్రిగేటర్‌ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ప్రదర్శన నుంచి తొలగించాల్సిందిగా నాంపల్లిలోని సిటీసివిల్‌ కోర్టు ఆదేశించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఆ బైక్‌ టాక్సీ సంస్థ పనితీరు ఉత్తమంగా ఉంటుందని చూపించే క్రమంలో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసేలా ప్రచార చిత్రాన్ని రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుండటాన్ని తప్పుపడుతూ ఇటీవల ఆర్టీసీ ఎండీ పరువునష్టం దావా హెచ్చరికలతో ఆ సంస్థకు, నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రసారాలను నిలిపివేయకపోవటంతో ఆర్టీసీ నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించింది.

తాజాగా ఆర్టీసీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సజ్జనార్‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసుల అనంతరం స్వల్పంగా ప్రచార చిత్రంలో మార్పు చేసినా.. ఆర్టీసీ బస్సును అలాగే చూపించటాన్ని తప్పుపడుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ ప్రచార చిత్రాన్ని ప్రసారం నుంచి తొలగించాలని, వీడియో అసలు, సవరించిన యాక్సెస్‌ను బ్లాక్‌ చేయాలని గూగుల్‌ ఆన్‌లైన్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ని కోర్టు ఆదేశించినట్టు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు