ఖమ్మం నుంచే కేసీఆర్‌పై దండయాత్ర

3 Jul, 2021 03:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం కేసీఆర్‌పై ఖమ్మం జిల్లా నుంచే దండయాత్ర ప్రారంభిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధిష్టానం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది పార్టీ స్వార్థం కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసమని పేర్కొన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియుక్తుడైన రేవంత్‌రెడ్డి శుక్రవారం రేణుకాచౌదరిని ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తమ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ వస్తామని అంటున్నారని, తమకు ఫోన్లు కూడా వస్తున్నాయని చెప్పారు. గొప్ప గొప్ప మాటలు చెప్పే ప్రధాని మోదీ గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.  

ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి: రేవంత్‌  
కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. పక్క రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్‌ పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇకపై కాంగ్రెస్‌ టికెట్‌తో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళితే రాళ్లతో కొట్టాలని, ఈ విషయంలో తానే ముందుంటానని పేర్కొన్నారు. 

చదవండి:  ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు