హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పునర్‌వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..

14 Dec, 2022 14:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిటీ పోలీసు కమిషనరేట్‌ పునర్‌ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్‌స్పెక్టర్‌ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్‌ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్‌ సన్నాహాలు చేస్తున్నారు. 

ఈస్ట్‌ జోన్‌: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్‌పేట్‌ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్‌ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్‌లోకి వస్తున్నాయి.   
 
నార్త్‌జోన్‌: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్‌–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్‌పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్‌ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్‌లోకే వస్తోంది.   

సౌత్‌ జోన్‌: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్‌ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్‌ ఠాణాలు ఉన్నాయి. పునర్‌వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్‌లో ఉండే ఫలక్‌నుమా డివిజన్‌ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి.

వెస్ట్‌ జోన్‌: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్‌ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్‌ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ ఈ జోన్‌ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్‌ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌ ఠాణాలు మాత్రమే ఉంటాయి

సౌత్‌ ఈస్ట్‌ జోన్‌: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్‌ ఈస్ట్‌ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌ సబ్‌–డివిజన్లతో పాటు ఈస్ట్‌ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్‌ నుంచి వచ్చే సంతోష్‌నగర్‌ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్‌నగర్‌లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌ ఠాణాలు ఈ కొత్త జోన్‌లో ఉంటాయి.   

సౌత్‌ వెస్ట్‌ జోన్‌: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్‌ వెస్ట్‌ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్‌ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్‌ పోలీసుస్టేషన్లు రానున్నాయి.    

సెంట్రల్‌ జోన్‌: ప్రస్తుతం ఈ జోన్‌లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్‌ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్‌ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్‌ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్‌ ఠాణాలు ఈ జోన్‌లో ఉండవు.   

మరిన్ని వార్తలు