టెట్‌ ఇంకెప్పుడో..! అభ్యర్థుల్లో ఆందోళన

27 Jan, 2021 02:03 IST|Sakshi

నోటిఫికేషన్‌ విడుదలపై అభ్యర్థుల్లో ఆవేదన

నెలన్నరలో ముగియనున్న మరో టెట్‌ వ్యాలిడిటీ

త్వరగా టెట్‌ నిర్వహించాలంటూ విజ్ఞప్తులు

టీఆర్టీ కంటే ముందే టెట్‌ నోటిఫికేషన్‌కు డిమాండ్‌

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంకా లభించని ఆమోదం

వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌..

ఈలోపు పోస్టుల భర్తీ కష్టమే.. మార్చి తర్వాతే భర్తీకి చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష (టీఆర్టీ) రాయాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణపై అడుగులు ముందుకు పడట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసి నెల కావొస్తున్నా టెట్‌ నిర్వహణపై ఉన్నత స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. టెట్‌ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు అవసరమైన కార్యాచరణ ఒక్కటీ మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రాకముందే టెట్‌ నిర్వహించాలని అభ్యర్థులకు కోరుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను విద్యా శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఇప్పటివరకు వాటికి ఇంకా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ ఆమోదం వస్తే నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం టెట్‌ నిర్వహించకుండా ముందుకు పోతే లక్షల మంది పోస్టుల భర్తీకి దూరం అయ్యే ప్రమాదం నెలకొంది.

నెలన్నరలో వ్యాలిడిటీ ముగింపు..
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్‌ వ్యాలిడిటీ ఏడేళ్లు. 2011 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన ఆరు టెట్‌లలో మూడు టెట్‌ల (2011 ఒకసారి, 2012లో రెండుసార్లు) వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసిపోయి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్‌ అర్హత కోల్పోయారు. ఇక 2014 మార్చి 16న నిర్వహించిన టెట్‌ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి 16వ తేదీతో ముగియనుంది. అందులోనూ మరో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతారు. మరోవైపు రాష్ట్రంలో 2015లో ఒకసారి టెట్‌ నిర్వహించగా, 2017లో చివరి టెట్‌ను నిర్వహించారు.

ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలోనూ మరో 1.5 లక్షల మంది బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థులు అసలు టెట్‌ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్‌ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెలలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో వెంటనే టెట్‌ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్‌ నిర్వహించకుండా టీఆర్టీ నోటిఫికేషన్‌ వస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలు అవసరం..
రాష్ట్రంలో టెట్‌ నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్‌ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు టీఆర్టీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు.

మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్‌?
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇప్పటివరకు ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికిప్పుడు 8 వేల పోస్టులు భర్తీ చేయొచ్చని పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించింది. అందులో 8 వేలకు పైగా పోస్టుల్లో పదోన్నతులు కల్పించొచ్చని పేర్కొంది. పదోన్నతులు చేపట్టాక టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇస్తే 15 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే వీలుంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి విద్యా శాఖకు ఇంకా ఆమోదం రాలేదు.

ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపినా పదోన్నతులు ఇచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యం అవుతుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫిబ్రవరిలో టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ కుదరదు. ఇక మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా టెట్‌ నిర్వహిస్తే తాము టీఆర్టీకి సిద్ధం అయ్యేందుకు సమయం దొరుకుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు