తెలంగాణ లేకుండానే ఆర్‌ఎంసీ తొలి భేటీ 

21 May, 2022 01:09 IST|Sakshi

వాయిదా విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఆర్‌ఎంసీ  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఈఆర్‌ఎంబీ) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో కలసి ఏర్పాటు చేసిన ‘రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ)’తొలి సమావేశం శుక్రవారం ఇక్కడి జలసౌధలో జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్‌ కర్వ్, కృష్ణాలో మిగులుజలాల అంశాలను తేల్చడానికి ఈ భేటీ ఏర్పాటు చేశారు.

అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని బోర్డు తోసిపుచ్చింది. కేఆర్‌ఎంబీ మెంబర్‌ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేఆర్‌ఎంబీ మెంబర్‌(పవర్‌) ఎల్‌.బి.ముత్తంగ్, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ సుజయకుమార్‌ హాజరయ్యారు. శ్రీశైలంలో జలవిద్యుత్‌ ఉత్పత్తికి సాగు, నీటి అవసరాలే ప్రామాణికం కావాలని నారాయణరెడ్డి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవోలు, బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులను పరిగణనలోకి తీసుకొని జలవిద్యుత్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు.

నీటి కేటాయింపులు, నిబంధనలు పాటిస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. తుంగభద్ర జలాశయంలోంచి నీటివిడుదలపై తుంగభద్ర బోర్డు అనుసరిస్తున్న ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోనూ అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విడుదల చేసిన రూల్‌ కర్వ్‌ ముసాయిదాపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులను పిలిపించి రూల్‌ కర్వ్‌పై చర్చించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. కృష్ణాలో మిగులు జలాలను లెక్కించరాదని కోరింది. కాగా, తదుపరి సమావేశంలో జలవిద్యుత్‌ ఉత్పాదనపై స్పష్టత వస్తుందని కేఆర్‌ఎంబీ మెంబర్‌ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై స్పష్టం తెలిపారు.   

మరిన్ని వార్తలు