తెల్లరేషన్‌ కార్డుల పునఃపరిశీలన.. ఇళ్ల వద్దకు అధికారులు

14 Jul, 2022 17:08 IST|Sakshi

2016లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనర్హుల పేరుతో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో వందలాది తెల్లకార్డులను తొలగించింది. లబ్ధిదారులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కార్డులను రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ... గతేడాది ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరి పలు సూచనలు చేసింది. రద్దు చేసిన తెల్ల రేషన్‌కార్డులపై పునఃపరిశీలన జరిపి వారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీంతో నేటి నుంచి తెల్లరేషన్‌ కార్డుల పునఃపరిశీలణను జిల్లా అధికార యంత్రాంగం ప్రారంభించింది.

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, ఆధార్‌ సంఖ్య రెండు సార్లు నమోదైన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయిన వారు, నిబంధనలకు మించి భూములు కలిగి ఉన్న వారు... తదితర కారణాలతో కార్డులను గతంలో రద్దు చేశారు. అయితే వారికి ఫలానా కారణంగా కార్డు రద్దు చేస్తున్నామనే నోటీసులు జారీ చేయకపోవడంతో ప్రస్తుతం మళ్లీ విచారించి నోటీసులు జారీ చేయాల్సి వస్తోంది.  

వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్‌ కార్డుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం నుంచి తనిఖీల నిమిత్తం సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారణ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి (రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

పరిశీలన అనంతరం అర్హులకు కార్డులు.. 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 95,040 తెల్లరేషన్‌ కార్డులు తొలగించారు. రద్దయిన ఈ కార్డులను పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి పరిశీలన అనంతరం అర్హులైన వారికి తిరిగి తెల్ల రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

లబ్ధిదారులకు ఇళ్లకు అధికారులు
రద్దు చేసిన తెల్లరేషన్‌ కార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకొని నోటీసులు జారీ చేసే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రద్దయిన కార్డుల జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. వాటిని ఆయా మండలాల తహసీల్దారులు డౌన్‌లోడ్‌ చేసుకొని విచారణ సాగిస్తున్నారు. రద్దయిన కార్డుదారులను కలిసి నోటీసులు జారీ చేసి వివరాలను సేకరిస్తున్నారు. విచారణలో అర్హులుగా తేలిన వారికి కార్డులను పునరుద్ధరిస్తారు.

మేడ్చల్‌ జిల్లాలో రద్దయిన తెల్లరేషన్‌ కార్డులు: 95,040 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో మొత్తంగా 95,040 తెల్ల రేషన్‌ కార్డులు రద్దు అయ్యాయి. మండలాలు, జీహెచ్‌ఎంసీ మున్సిపల్‌ సర్కిళ్ల వారీగా రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల ఈ విధంగా ఉన్నాయి. బాచుపల్లి మండలంలో 2,378 తెల్లరేషన్‌ కార్డులు రద్దు కాగా, ఘట్‌కేసర్‌లో 2,273, కాప్రాలో 2,263, కీసరలో 3,388, మేడ్చల్‌లో 2,306, మేడిపల్లిలో 4,165, శామీర్‌పేట్‌లో 893, మూడు చింతలపల్లి మండలంలో 328 రేషన్‌కార్డులు రద్దయ్యాయి. 

► అలాగే, ఉప్పల్‌ మున్సిపల్‌ సర్కిల్‌ పరిధిలో 39,270, బాలానగర్‌ మున్సిపల్‌ సర్కిల్‌ పరిధిలో 35,210 తెల్ల రేషన్‌ కార్డులు రద్దు అయ్యాయి. 

రద్దయిన కార్డుదారులు అందుబాటులో ఉండాలి
గతంలో రద్దయిన రేషన్‌ కార్డుదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి. విచారణకు నియమించబడిన అధికారులు తనిఖీల నిమిత్తం మీ ఇంటి వద్దకు వస్తారు. జిల్లాలో మొత్త గా 95,040 తెల్లరేషన్‌ కార్డులు రద్దయ్యాయి. ఇంటి చిరునామా, ఫోన్‌ తదితర విషయాలలో ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే సంబంధిత తహసీల్‌/సహాయ, పౌర సరఫరాల కార్యాలయంలో సంప్రదించాలి.
– ఏనుగు నర్సింహారెడి, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) 

మరిన్ని వార్తలు