హెలికాప్టర్‌ సడన్‌గా పడిపోయి ఉండొచ్చు

10 Dec, 2021 02:27 IST|Sakshi
టీజే రెడ్డి, ఎన్‌ఎన్‌ రెడ్డి

ప్రతికూల వాతావరణానికి సాంకేతిక లోపం తోడై ఉంటుంది 

అప్పుడు ఎంఐ–17లో 1,200 లీటర్ల ఇంధనం ఉండే అవకాశం... కింద పడగానే మంటలు వచ్చుండొచ్చు

బ్లాక్‌ బాక్స్, సీవీఆర్‌ విశ్లేషణ తర్వాతే వాస్తవాలు 

‘సాక్షి’తో రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ టీజే రెడ్డి, రిటైర్డ్‌ ఎయిర్‌ కమోడోర్‌ ఎన్‌ఎన్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌/కంటోన్మెంట్‌: ప్రతికూల వాతావరణానికి సాంకేతికలోపం తోడై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్‌ సడన్‌గా డ్రాప్‌ అయి కిందికి వచ్చి ఉంటుందని, దీని వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ టీజే రెడ్డి, రిటైర్డ్‌ ఎయిర్‌ కమోడోర్‌ ఎన్‌ఎన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఎంఐ–17 హెలికాప్టర్‌ గంట ప్రయాణానికి 800 లీటర్ల ఇంధనం అవసరం అవుతుందని, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో కనీసం 1,200 లీటర్ల ఇంధనం ఉండే అవకాశముందని, ఎత్తు నుంచి కిందకు పడిపోయిన వెంటనే ఇంధనం వల్ల మంటలు చెలరేగి ఉంటాయన్నారు. హెలికాప్టర్‌లోని ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (బ్లాక్‌ బాక్స్‌), కాక్‌ పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ విశ్లేషణ తర్వతే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ఈ విశ్లేషణకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టొచ్చన్నారు. టీజే రెడ్డి, ఎన్‌ఎన్‌ రెడ్డి గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై వీరేమన్నారంటే.. 

చలికాలం.. పొగ మంచు.. 
వీఐపీలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లను అత్యంత అనువభమున్న పైలెట్లే నడుపుతారు. టేకాఫ్‌ అవడానికి ముందే వాటిని అనేక రకాలుగా పరీక్షిస్తారు. సీడీఎస్‌ రావత్‌ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్‌లోని వెదర్‌ రాడార్‌లో ప్రయాణ మార్గంలో వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే మేఘాలు స్పష్టంగా కనిపించినా పొగమంచు ఆ స్థాయిలో కనిపించదు. రావత్‌ ప్రయాణించిన మార్గంలో కొండలు, అడవులు ఉన్నాయి.

చలికాలంలో కొండలపై భాగంలో పొగమంచు ఎక్కువుంటుంది. ఒక్కోసారి ఊహించిన దానికంటే ఎక్కువగానూ ఉండొచ్చు. అనుకోకుండా పెరిగిపోవచ్చు. గమ్యానికి మరో 10–15 కి.మీ. దూరంలోనే ఉండటంతో పైలెట్‌ హెలికాఫ్టర్‌ను కిందికి తీసుకువచ్చి ఉంటాడు. ఆ సమయంలో మంచు వల్ల కింద ఏముందో కనిపించకపోవచ్చు. అయినా అనుభవజ్ఞుడైన పైలెట్‌ కావడంతో ధైర్యంగా కిందికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి హెలికాప్టర్‌ సడన్‌గా డ్రాప్‌ అయి ఉంటుంది. ఒకేసారి 100 నుంచి 150 అడుగులు కిందికి పడిపోయి ఉంటుంది. దీని వల్ల హెలికాప్టర్‌లోని ఇంధనం నుంచి మంటలు అంటుకొని ఉండొచ్చు. 

వాతావరణం బాగోలేనప్పుడు.. 
వాతావరణం బాలేనప్పుడు పైలట్లు సురక్షితమైన ఎత్తును పాటిస్తూ ఉంటారు. గమ్యానికి చేరాక దిగాల్సిన చోట నాలుగైదు రౌండ్లు వేసి హైట్‌ తగ్గించుకుని ల్యాండ్‌ చేస్తారు. రావత్‌ హెలికాప్టర్‌ విషయంలో ఇలా ఎందుకు జరగలేదో తేలాల్సి ఉంది. హెలికాప్టర్‌ బయలుదేరినప్పటి నుంచి కూలే వరకు ఎంత ఎత్తులో ప్రయాణించింది, సాంకేతిక సమస్యలు వచ్చాయా లాంటివి ఫ్లైట్‌ డేటా రికార్డర్‌లో ఉంటాయి. పైలట్, కోపైలట్‌ ఏటీసీతో జరిపిన సంభాషణ అందులో ఉంటుంది. వాటిని విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలుస్తాయి.

మరిన్ని వార్తలు