మాకూ పింఛన్‌ ఇవ్వండి.. 

29 Aug, 2021 02:48 IST|Sakshi

2008 జూన్‌ 30 లోపు రిటైర్‌ అయిన వీఆర్వోల వేడుకోలు 

ఉమ్మడి రాష్ట్రంలో ఫలించిన సుదీర్ఘ పోరాటం 

ఏపీలో పింఛన్‌ అందుకుంటున్న 1,733 మంది 

విభజన చట్టంలో పేర్కొన్నా తెలంగాణలో అమలు కాని వైనం 

ఆరేళ్లకుపైగా 492 మందికి నిరాశ.. 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: బ్రిటిష్, నిజాం కాలం నుంచి గ్రామాల్లో రెవెన్యూ, శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు గ్రామాల్లో పట్వారీ, పటేల్‌ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూములకు సంబంధించిన కీలకమైన రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడుతుండేవారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1992లో తిరిగి వీరిలో అర్హులైన వారిని వీఏఓలుగా ప్రభుత్వం నియమించింది.

అప్పట్లో రూ.600 గౌరవ వేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేశారు. చివరకు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదివిన వారిని 2002 జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్‌ ఇచ్చారు. వారిని వీఆర్వోలుగా, పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. 2002లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై 2008 జూన్‌ 30లోగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కనీసం ఏడేళ్ల సర్వీసు లేదంటూ పింఛన్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇలాంటి వారు ఉమ్మడి ఏపీలో 2,225 మంది ఉన్నారు.

తాము దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సేవలందించామని, తమకు కనీస పింఛన్‌ మంజూరు చేసేందుకు గతంలో 1992 నుంచి 2002 మధ్య పని చేసిన కాలాన్ని కలపాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలు, 1980 ఆర్‌పీఆర్‌ జీవోలను పరిశీలించిన తర్వాత ఫైలు నం.28496/అ/2013 ప్రకారం పాత సర్వీసును పరిగణనలోకి తీసుకుని 2,225 మందికి కనీస పింఛన్‌ సౌకర్యం కల్పిస్తూ 2014 ఫిబ్రవరి 2న ఫైలుపై అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. 

ఏపీలో అమలు..  తెలంగాణలో ఎదురుచూపులు! 
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఫైలు 28496/అ/2013 ప్రకారం ఏపీకి చెందిన 1,733 మందికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌ సౌకర్యం కల్పిస్తూ 2014 నవంబర్‌ 20న జీవో నంబర్‌ 388 జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రిటైర్డ్‌ వీఆర్వోలు పింఛన్‌ పొందుతున్నారు. అయితే తెలంగాణలోని 492 మందికి మాత్రం ఆరేళ్లకుపైగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఆర్థిక, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి లభించినా ఫైలు మాత్రం ముందుకు కదలలేదు. ఈ జాప్యానికి అధికారులే కారణమని రిటైర్డ్‌ వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. 

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శ్రీనివాసరావు..


వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తికి చెందిన ఈయన వీఆర్వోగా పనిచేస్తూ 2008లో రిటైర్‌ అయ్యారు. పింఛన్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన ఇటీవల పెరాలసిస్‌ బారిన పడ్డారు. మందులు కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ..ఇది ఒక్క శ్రీనివాసరావు దీనగాథ మాత్రమే కాదు. 2008 జూన్‌ 30లోపు ఉద్యోగ విరమణ పొందిన తెలంగాణలోని పలువురు వీఏఓలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఉద్యోగానికి, ఇటు పింఛన్‌ కోసం కోర్టులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి సుదీర్ఘ పోరాటం చేసి 2014లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వారికి పింఛన్‌ అందుతుండగా.. తెలంగాణలో ఉన్న వారికి మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదు. 

పైస్థాయి అధికారుల నిర్లక్ష్యంతోనే.. 
ఆరున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. పైస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతోంది. 


– డీకే మోహన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం 

సీఎం దృష్టికి తీసుకుపోనందుకే.. 
సీఎం కేసీఆర్‌ దృష్టికి అధికారులు మా సమస్యను తీసుకుని పోకపోవడం వల్లే జాప్యం జరుగుతోంది. ఆయనకు తెలిస్తే మా పింఛన్‌ ఫైల్‌పై సంతకం చేస్తారనే నమ్మకం ఉంది. 


– వి.నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం 

చచ్చే వరకైనా పింఛన్‌ వచ్చేనా? 
పింఛన్‌ కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు పింఛన్‌ వస్తుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. మేం చనిపోయే వరకైనా వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. 


– ప్రకాశ్‌రావు, రిటైర్డ్‌ వీఆర్వో, గజ్వేల్, సిద్దిపేట  

మరిన్ని వార్తలు