కాంగ్రెస్‌లో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వట్లేదు: రేవంత్‌ రెడ్డి

6 Jul, 2022 02:10 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్‌  రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి విక్రమార్క 

పార్టీ నేతలవి భిన్నాభిప్రాయాలే... భేదాభిప్రాయాలు కాదు 

సమస్యలను పార్టీలోనే పరిష్కరించుకుంటాం 

చేరికలపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ  

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వట్లేదని, పార్టీ విధానానికి అనుగుణంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మున్ముందు పార్టీలో పెద్దఎత్తున చేరికలు ఉంటాయని, వాటిపై వ్యూహాత్మకంగా సాగుతున్నామని అన్నారు. అయితే పార్టీలో చేరేవారి గురించి ముందే మీడియాకు తెలియడంవల్ల వారిపై అధికార టీఆర్‌ఎస్‌ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని, అందువల్లే వారి గురించి ముందుగా బయటకు తెలియనివ్వట్లేదని రేవంత్‌ చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో అనేక అంశాలపై నేతల్లో ఉన్న భిన్నాభిప్రాయాలను భేదాభిప్రాయాలుగా భావించాల్సిన అవసరంలేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పార్టీ సమస్యలను అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కలతో కలసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ అయ్యారు. అనంతరం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

గంటకుపైగా జరిగిన భేటీలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తాజా పరిస్థితులు, ఇతర పార్టీల నేతల చేరికలు, రాష్ట్రంలో మరోసారి రాహుల్‌గాంధీ పర్యటన, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ గత ఏడాదిలో చేసిన సంస్థాగత కార్యక్రమాలు, టీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు, విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్‌ తదితర అంశాలపై చర్చ జరిగింది.  

గెలుపు ఒకటే ప్రాతిపదిక కాదు
వచ్చే ఎన్నికల్లో గెలుపు ఒకటే కాకుండా కాంగ్రెస్‌పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, విశ్వసనీయతను కూడా పరిగణనలోకి తీసుకొని టికెట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. పార్టీలో చేరాలనుకొనేవారికి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పేరిట హడావుడి చేస్తున్నారని, ఇదంతా కేవలం మోదీ, బీజేపీలకు ఉపయోగపడటం కోసమేనని విమర్శించారు.

మోదీకి అనుకూల పరిస్థితులు సృష్టించేందుకు విపక్షాలను చీల్చే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కలలు కంటున్నట్లు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మూడోసారి అవకాశం రాబోదని, వీలైనంత త్వరగా దానిని గద్దె దించి తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని పేర్కొన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో బీజేపీ చేసిన బలప్రదర్శన తర్వాత ఇప్పుడు టీఆర్‌ఎస్‌ తమ బలప్రదర్శన చూపించాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసే సభతో తెలంగాణ ప్రజలు ఎవరితో ఉన్నారో స్పష్టత వస్తుందని అన్నారు.  

పాతవారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గబోదు: భట్టి విక్రమార్క 
రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని భట్టి పేర్కొన్నారు. అయితే కొత్తవారిని చేర్చుకున్నంత మాత్రాన పాతవారికి పార్టీలో ప్రాధాన్యత ఏమాత్రం తగ్గబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ భావజాలం ఉన్నవారిని దశలవారీగా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీల దోస్తీ బయటపడిందని విమర్శించారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌ సందర్భంగా బల ప్రదర్శన చూశాకే, హైదరాబాద్‌లో బీజేపీ బలప్రదర్శన చేసిందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.   

మరిన్ని వార్తలు