Telangana: రాష్ట్రాన్ని తగలబెట్టి  శ్మశానాలు ఏలుతారా?

25 Aug, 2022 02:09 IST|Sakshi

తెలంగాణను బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఏం చేయదల్చుకున్నాయి? 

కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఇళ్ల మీద ఐటీ దాడులు ఎందుకు చేయలేదు?  

నెలాఖరులోగా మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎవడో జోకర్‌ ఏదో మాట్లాడాడు. ఆ జోకర్‌కు ఈ సన్నాసులు పోలీసుల కాపలా పెట్టి అనుమతినిచ్చారు. ఆ జోకర్‌ మాట్లాడిన దానిపై రాజాసింగ్‌ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడతారు. ఇంతకూ ఈ రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారు? తెలంగాణను తగలబెట్టి శ్మశానాలను ఏలాలని బీజేపీ అనుకుంటోందా? కేసీఆర్‌ ఏం చేయదల్చుకున్నారు? ఇంతటి విద్వేషాలను రెచ్చగొట్టి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం భావ్యమా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు మల్లురవి, చిన్నారెడ్డి, అనిల్, శంకర్‌ నాయక్, ప్రీతం, రోహిణ్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియా భేటీలో మాట్లాడారు. ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగింది. ఆ పార్టీకి పంజాబ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆర్థిక సాయం అందించింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి సీఎం కేజ్రీవాల్‌ను కేసీఆర్‌ కలిశారు. ఇద్దరూ కలిసి పంజాబ్‌ కూడా వెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఆయా పార్టీలకు ఆర్థిక తోడ్పాటునందించి తనకు అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ కుటుంబస భ్యుల ఇళ్లపై సీబీఐ, ఈడీ ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ ఐటీ దాడులు చేసి వ్యాపార సంస్థలను బెంబేలెత్తిస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఎన్ని కలు రాగానే సుమధుర, వాసవి, ఫీనిక్స్‌ సంస్థలపై దాడులు మొదలయ్యాయన్నారు. ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కాదని, బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అని అన్నారు. 

ప్రియాంక మార్గదర్శనం 
మునుగోడు అభ్యర్థిని నెలాఖరు వరకు ప్రకటిస్తామని, ఒకట్రెండు రోజులు అటూ ఇటు అవుతుందని రేవంత్‌ చెప్పారు. ఇంకా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు కూడా ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రియాంకాగాంధీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వెల్లడించారు.   

   

మరిన్ని వార్తలు