Drugs Case: నమూనాలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారు?

6 Apr, 2022 02:12 IST|Sakshi

‘డ్రగ్స్‌’ కేసులో పోలీసులను ప్రశ్నించిన రేవంత్‌ 

చిత్తశుద్ధి ఉంటే విచారణ కోసం కేంద్రానికి సీఎం లేఖ రాయాలి

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో డ్రగ్స్‌ వినియోగం విషయంలో ముద్దాయిలుగా చూపించిన 142 మంది నమూనాలను తీసుకోకుండా, వారిని ఎందుకు విడిచిపెట్టారో బహిర్గత పరచాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పోలీసుల్ని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ చేపట్టాలని, ఇప్పటికైనా నమూనాలను సేకరించి నిగ్గు తేల్చాలని కోరారు.

అంతేగాక డ్రగ్స్‌ వ్యవహారంలో అధికారులకు అనుమానం ఉన్న వారి జాబితాను ఇస్తే తమ పిల్లల్ని కూడా తీసుకొస్తానని చెప్పారు. అలాగే నీ కొడుకుని కూడా శాం పిల్స్‌ తీసుకొనేందుకు పంపిస్తావా అంటూ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌ విసిరారు.

డ్రగ్స్‌ అంశం లో సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కొడుకుపై ఏమాత్రం అనుమానం లేకపోతే విచా రణ చేపట్టాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగా ణ భవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  

డ్రగ్స్‌ హబ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోంది 
తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని, రాష్ట్రాన్ని డ్రగ్స్‌ హబ్‌గా, మరో పంజాబ్‌లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం డ్రగ్స్‌ అంశానికి కారణమైన పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌కు 24 గంటల పాటు మద్యం సరఫరా చేసేందుకు లైసెన్స్‌ ఇచ్చింది మీరు కాదా? అంటూ సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి నమూనాలు సేకరించకుండా వదిలి వేయడం వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. పిల్లల్ని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  

సినిమా వాళ్లను లొంగదీసుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు 
డ్రగ్స్‌ కేసు కంటే ముందు ఏ సినిమా వాళ్ళు కేటీఆర్‌ కు పరిచయం లేరని, సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్‌ కేసుల్లో ఇరుక్కున్న తర్వాతే కేటీఆర్‌కు సినిమా వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. డ్రగ్స్‌ కేసును అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళను లొంగదీసుకొని, వాళ్ల అన్ని అవసరాలను తీర్చుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు.  

మిల్లర్లతో కేసీఆర్‌ కుటుంబం కుమ్మక్కు 
రాష్ట్రంలోని మిల్లర్లతో కేసీఆర్‌ కుటుంబం కుమ్మక్కయ్యిందని, రైతులు ఎంఎస్పీ కంటే రూ.500 తక్కువకు మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పించారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.2,500 కోట్ల రైతాంగం శ్రమను దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారని, ఇందులో కేసీఆర్‌ కుటుంబం వాటా ఎంతో తేల్చాలని డిమాండ్‌ చేశారు. బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు