రేవంత్‌ రెడ్డి గృహ నిర్బంధం 

20 Jul, 2021 01:50 IST|Sakshi
రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు

కోకాపేట భూముల పరిశీలనకు వెళ్లకుండా ఇంటి ముందు పోలీస్‌ పహారా 

పార్లమెంటు సమావేశాలకు రానివ్వకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు లేఖ రాసిన రేవంత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేట భూముల వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త గా ఆయన్ను హౌస్‌ అరెస్టు చేశారు. పార్ల మెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఎంపీ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటు సభ్యుడిగా సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడం తన హక్కు అని, దీన్ని కాపాడేలని కోరారు.  

భట్టితో సహా పలువురు నేతలు 
కోకాపేట భూముల పరిశీలనకు టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముం దుజాగ్రత్తగా రేవంత్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆలిండియా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మాజీమంత్రి షబ్బీర్‌ అలీని  వారి ఇళ్లలోనే పోలీసులు నిర్బంధించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ పోలీసుల కళ్లు గప్పి ఢిల్లీ వెళ్లిపోయారు.  

మాకేం అభ్యంతరం లేదు: ఏసీపీ 
రేవంత్‌ గృహనిర్బంధంపై హైదరాబాద్‌ పోలీసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌ వెల్లడించారు. కోకాపేట భూముల విషయంలో ఆందోళన నిర్వహించా లని కాంగ్రెస్‌ పిలుపునిచ్చినందునే రేవంత్‌ ఇంటి ముందు పోలీసులను ఉంచామని పేర్కొన్నారు.
 
మేం అధికారంలోకి వస్తే  తీసుకుంటాం..
కోకాపేటలో భూములు కొన్న కంపెనీలను వదిలిపెట్టేది లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను తిరిగి తీసుకుంటామని చెప్పారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులకు భూములను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.  

కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు: మాణిక్యం 
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల హౌస్‌ అరెస్టును ఏఐసీసీ తీవ్రంగా ఖం డించింది. సీఎం కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్‌కు వచ్చే సభ్యుడిని అడ్డుకోవడం సరికా దని ధ్వజమెత్తారు. రేవంత్‌ అక్రమ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకువెళ్తామని మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు