జునాగఢ్‌ ఉత్సవాలు ఎందుకు నిర్వహించరు?

18 Sep, 2022 02:58 IST|Sakshi
గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ అనంతరం మాట్లాడుతున్న రేవంత్‌. చిత్రంలో రాజనర్సింహ, పొన్నాల, గీతారెడ్డి, విజయారెడ్డి తదితరులు.

బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సూటిప్రశ్న

హైదరాబాద్‌కు, గుజరాత్‌లోని జునాగఢ్‌కు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చింది కదా?

విమోచన వజ్రోత్సవాల పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శ

స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తోపాటు గుజరాత్‌లోని జునాగఢ్‌కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, మరి బీజేపీ నేతలు అక్కడ ఎందుకు వజ్రోత్సవాలు నిర్వహించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసం సెప్టెంబర్‌ 17ను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చిల్లర వేషా లు వేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను ద్దేశించి ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లో ఉత్సవా లు జరిపిన తర్వాతే హైదరాబాద్‌లో విమో చన ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకు పోవాలనే కుట్రతోనే ఇక్కడ కొత్త వేషాలు కడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అమలు చేసే ప్రణాళికలేంటో వివరించాలని డిమాండ్‌ చేశారు.

సర్దార్‌ పటేల్‌ మా వాడు...
హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తమ వాడని, ఆయనది కాంగ్రెస్‌ కుటుంబమని, తమ నుంచి పటేల్‌ను ఎవరూ విడదీయలేరని రేవంత్‌ వ్యాఖ్యానించారు. పటేల్‌ తన హయాంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ చరిత్రను దొంగిలించి తమ చరిత్రగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టే పరిస్థితులు టీఆర్‌ఎస్‌ వల్లే ఏర్పడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, టీఆర్‌ఎస్‌ల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్‌ రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్‌ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని సన్మానించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావెద్, అంజన్‌కుమార్‌ యాదవ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సిటీ కాంగ్రెస్‌ నాయకులు విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ కాంగ్రెస్‌ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్‌ పంతులుతోపాటు పలువురిని రేవంత్‌ శాలువాలతో సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. ఆపై ఇందిరా భవన్‌లో జరిగిన టీపీసీసీ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ సెల్‌ చైర్మన్‌ పి.రాజేంద్రన్‌ పదవీబాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడుతూ మాజీ సైనికులకు నెలలో బెనిఫిట్స్‌ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం   

ఇదీ చూడండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!

మరిన్ని వార్తలు