నడుచుకుంటూ సిట్‌ ఆఫీస్‌కు రేవంత్‌.. తీవ్ర ఉద్రిక్తత

23 Mar, 2023 15:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిట్‌ విచారణకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్‌ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు.. రేవంత్‌కు నోటీసులు ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. లిబర్టీ వద్ద రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు.సిట్‌ ఆఫీస్‌కు నడుచుకుంటూ రేవంత్‌ వెళ్లారు.

గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీపై ఆరోపణలు చేసిన రేవంత్‌కు ఆధారాలు ఇవ్వాలంటూ సిట్‌ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్‌ స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేయనున్నారు. రాజశేఖర్‌, తిరుపతిపై చేసిన ఆరోపణలపై సిట్‌ వివరణ కోరనుంది.

పేపర్‌ లీకేజీ ఆరోపణలపై ఆధారాలుంటే సమర్పించాలని సిట్‌ కోరనుంది. రేవంత్‌ హాజరు నేపథ్యంలో సిట్‌ కార్యాలయం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్‌ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. మరో వైపు సిట్‌ ఆఫీసు వద్ద గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరిని హౌస్‌ అరెస్ట్‌లు చేశారు.

కాగా, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక కేటీఆర్ పీఏ హస్తం ఉందంటూ రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ2 నిందితుడు రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి స్నేహితులన్న రేవంత్.. వారి మండలంలో 20 మందికిపైగా టాప్ మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపించారు. ఒకే జిల్లాలో 100మందికి ర్యాంకులు వచ్చాయన్న రేవంత్ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్‌ నోటీసులు జారీ చేసింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు

మరిన్ని వార్తలు