సీఎం ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చారు?

26 Nov, 2021 03:31 IST|Sakshi

తెలంగాణలో చనిపోయిన లక్ష మంది రైతులకి ఏం ఇవ్వరా? 

పాలమూరు బిడ్డలు బానిసలుగానే బతకాలా..?

ఒక్క కొల్లాపూర్‌నే కాదు.. మొత్తం పాలమూరునే దత్తత తీసుకుంటాం: రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చాడో చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు మూడు లక్షలు ఇస్తామన్నంటున్న కేసీఆర్‌... తెలంగాణలో చనిపోయిన వేల మంది రైతులకు ఏమివ్వడా అని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అమెరికా విభాగం కన్వీనర్‌ అభిలాశ్‌రావు పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిలాష్‌రావుకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు ద్రోహి అన్నారు.

రెండోసారి సీఎం అయినప్పటి నుండి 67 వేల మంది రైతులు చనిపోయారని ఆరోపించారు. పాలమూరు జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని, నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం కొల్లాపూర్‌ అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏ అడ్డమీద చూసిన పాలమూరు బిడ్డలే ఉన్నారని, వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావద్దా, బానిసలుగానే బతకాలా అని ప్రశ్నించారు. పూర్వ జిల్లాలో తిరిగి కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క కొల్లాపూర్‌నే కాదు మొత్తం పాలమూరునే కాంగ్రెస్‌ పార్టీ దత్తత తీసుకుంటుందన్నారు. పాలమూరు బిడ్డకి కాంగ్రెస్‌లో చట్టసభల్లోకి అవకాశం ఇచ్చిందే సోనియాగాంధీ అని గుర్తు చేశారు.

ఇప్పటి వరకు ఎవరెవరికో ఓట్లు వేశాం ఇప్పుడు కాంగ్రెస్‌కు వేద్దామని అన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని దోచేవాడు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అని, నోట్ల కట్టలు లేనిదే ఆయన ఏ పనీ చేయడని విమర్శించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 27 , 28ల్లో ఇందిరాపార్క్‌లో చేపడుతున్న ‘వరి దీక్ష’కు రైతులు, కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన అభిలాష్‌ రావ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ సిద్ధాంతమే తన సిద్ధాంతమని, ప్రాణం పోయేవరకు కాంగ్రెస్‌ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేనారెడ్డి, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు