వరంగల్‌ నుంచే కేసీఆర్‌ చీడ వదిలిద్దాం

24 Apr, 2022 04:32 IST|Sakshi

మే 6న జరగబోయే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేద్దాం

గాంధీభవన్‌లో జరిగిన సభ సన్నాహక సమావేశంలో రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక పోరాటాలకు పురుటిగడ్డ వరంగల్‌ నుంచే సీఎం కేసీఆర్‌ చీడ వదిలించాలని, ఇందుకు మే 6న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే ‘రైతు సంఘర్షణ సభ’ నాంది కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో రాహుల్‌ రెండ్రోజుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని స్థాయిల్లోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్య క్షులు, అనుబంధ సంఘాల నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు సమావేశానికి హాజర య్యారు. వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాలలో రాహుల్‌ పాల్గొనే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడంపై చర్చించారు. 

20 ఏళ్లకు సభ గుర్తుండిపోవాలి
40 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించి దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత రాహుల్‌ పాల్గొనబోయే దేశంలోని తొలి సభ ఇదేనని రేవంత్‌ అన్నారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణవైపు చూస్తోందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ కష్టకాలం లో ఉన్నప్పుడల్లా వరంగల్‌లో సభ పెట్టి బలంగా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేసిందని, 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ ఇక్కడ సభ నిర్వహిస్తోందని అన్నారు. 2002లో సీనియర్‌ నేత వీహెచ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో బీసీ గర్జన సభ జరిగిందని, మళ్లీ ఇప్పుడు సభ పెడుతున్నామని, ఇది రాబోయే 20 ఏళ్లకు గుర్తుండిపో వాలని అన్నారు. ఈ సభతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు పునాదులు పడాలని చెప్పారు. 

రైతుల కోసం ఏం చేస్తామో కూడా చెప్పాలి: ఉత్తమ్‌ 
సభకు రైతు గర్జన సభ అని నామకరణం చేయాలని, రైతుల సమస్యలు లేవనెత్తుతూనే అధికారంలోకి వచ్చాక రైతులకు ఏం చేస్తామో చెప్పాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచిం చారు. సభలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని, 200 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల నుంచి జనసమీకరణ ఎక్కువగా చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మంచి నీరు, ఇతర ఏర్పాట్లపై  దృష్టి పెట్టాలన్నారు.

మరిన్ని వార్తలు