‘మెడికల్‌ పీజీ సీట్ల దందాపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోండి’

24 Apr, 2022 04:05 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసైకి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్‌ దందాపై సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కుంభకోణంలో టీఆర్‌ఎస్‌ మంత్రుల ప్రమేయం ఉన్నందున సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆషామాషీ విచారణ చేస్తే నిగ్గు తేలదని, ఆలస్యం చేయకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.

ఈ మేరకు గవర్నర్‌కు రేవంత్‌ శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘పీజీ వైద్య విద్య సీట్ల బ్లాక్‌ దందాపై పేద, మధ్య తరగతి విద్యార్థులు వారం రోజులుగా రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, వర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్‌ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన వారిని మెరిట్‌ కోటాలో ప్రైవేటు కళాశాలల్లో మెడికల్‌ పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేయించి,  తర్వాత ఆ సీటును బ్లాక్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. స్వయంగా మంత్రులకు చెందిన కాలేజీలే దందా చేస్తుంటే సాధారణ పోలీసు విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసించగలమా? ఈ దందాపై కఠిన వైఖరి ప్రదర్శించాలి’అని రేవంత్‌ కోరారు.

మరిన్ని వార్తలు