ట్రిబ్యునల్‌కు భూ పంచాయితీలు

27 Sep, 2020 13:11 IST|Sakshi

ఎస్‌.శ్రీనివాస్‌ అనే వ్యక్తి  సిరిసిల్ల నివాసి. ముస్తాబాద్‌ మండలం మొర్రాయిపల్లెలో 1.24 ఎకరాలు ఉందని, రెవెన్యూ అధికారులు తనకు తెలియకుండానే మరొకరి పేరిట పట్టాచేశారని ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో కోర్టులో ఏడాదికి పైగా కేసు నడుస్తోంది. ఇరువర్గాల వాదనలు ఆర్డీవో విన్నారు. హియరింగ్‌ ముగిసింది. తీర్పు వస్తుందనే దశలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. కేసు వాయిదా పడింది. లాక్‌డౌన్‌ అనంతరం భూ వివాదం పరిష్కారం అవుతుందని ఇరువర్గాలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీనివాస్‌ కేసు ఆర్డీవో కోర్టులో అలాగే ఉంది. ఇలాంటి కేసులు జిల్లాలో దాదాపు 736వరకు ఉన్నాయి. వీటిల్లో జేసీకోర్టులో ఇటీవలే తీర్పులు వచ్చి హైకోర్టుకు వెళ్లిన కేసులు 20వరకు ఉన్నాయి. హియరింగ్‌లో 56 కేసులు ఉన్నాయి.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఏళ్లుగా కొనసాగుతున్న భూ పంచాయితీల సత్వర పరిష్కారానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రెవెన్యూకోర్టులో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేస్తోంది. భూముల ధరలు పెరగడం, భూ పంచాయితీ సమస్యలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరగకుండా ట్రిబ్యునల్‌ దోహదపడేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కోర్టుల్లో 736కేసులు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా హియరింగ్‌ జరగడం, వాయిదాల దశలో ఉన్నాయి. కొన్ని తుదితీర్పు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావడం, అందులో భాగంగా భూ పంచాయితీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తున్నారు.

అధికారులకు తప్పనున్న పనిభారం 
ప్రోటోకాల్‌ అమలు, రెవెన్యూ సంబంధ పనులు, ఇతర బాధ్యతలతో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్లు(ప్రస్తుత అడిషనల్‌ కలెక్టర్లు) బీజీగా ఉంటారు. భూ సేకరణ, మంత్రులు, అధికారుల పర్యటనలు, సమావేశాలతో ఒత్తిళ్లమధ్య విధులు నిర్వహిస్తుంటారు.  దీంతో భూ సమస్యల పరిష్కారానికి వారికి సరైన సమయం, విచారణ చేసే అవకాశాలు తక్కువ. ప్రత్యేక ట్రిబ్యునల్‌ ద్వారా భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని కక్షిదారులు ఆశిస్తున్నారు.

రిటైర్డుజడ్జి ద్వారా ట్రిబ్యునల్‌
జిల్లాలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ట్రిబ్యునల్‌కు బదలాయింపు చేస్తారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం రిటైర్డు జడ్జిని నియమించి కేసుల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రతి వెయ్యి భూ పంచాయితీలకు ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటు కానుంది. ఈ లెక్కన జిల్లాలో ఒక ట్రైబ్యునల్‌ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

ఫిర్యాదులు లేని భూ వివాదాలు
జిల్లాలో ఫిర్యాదులు లేని భూ సమస్యలు చాలానే ఉన్నాయి. అన్నదమ్ముల భూ పంపిణీ వివాదాలు, సరిహద్దు పంచాయితీలు, ఒకరి పేరిటా ఉన్న భూమిని మరొకరి పేరుతో పట్టా చేయడం, ఆన్‌లైన్‌లో తప్పులు, రికార్డుల్లో తక్కువ భూమి నమోదు, సర్వే నంబర్లలో తప్పులు, 1బీ రికార్డుల్లో పేరు మార్పిడి, మ్యూటేషన్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొన్ని రెవెన్యూ కోర్టుల వరకు వెళ్తే.. ఊర్లో పెద్ద మనుషుల ద్వారా మరిన్ని పంచాయితీలు నడిచేవి ఉన్నాయి. వీటన్నింటికి ట్రిబ్యునల్‌ పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు