మద్యం ప్రియులు.. తెగ తాగేశారు!

1 Jun, 2021 09:06 IST|Sakshi

5 నెలల్లో రూ.89.83 కోట్ల బీర్ల విక్రయాలు 

ఎండల తీవ్రతతో గిరాకీ

సాక్షి, వైరా: ఎండల తీవ్రత పెరగడంతో మద్యం ప్రియులు చల్లటి బీర్లను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాటి విక్రయాలు అమాంతంగా పెరిగి పోయాయి. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. మే నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ తాపం నుంచి సేద తీరేందుకు మందుబాబులు చల్లటి బీర్లు తాగేశారు. గతేడాది జనవరి నుంచి మే నెల వరకు రూ.61 కోట్ల విలువ చేసే బీర్లను తాగగా, ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రూ.89.83 కోట్ల విలువైన బీర్లు లాగించేశారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరాకు ఇబ్బంది లేకుండా డిపో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 47 బార్లు, 3 క్లబ్‌లు ఉన్నాయి. వాటితో పాటు అనధికారికంగా  వేల సంఖ్యలో బెల్టుషాపుల్లో బీర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. 

అదనపు వసూళ్లు..
వ్యాపారులు కొన్ని చోట్ల సిండికేట్‌గా మారి బీరు ధరపై అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టి దండుకుంటున్నారు. జిల్లాలో చాలా మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు. పక్కనే ఉన్న బెల్టు దుకాణాల్లో మాత్రం యథేచ్ఛగా బీర్లు అమ్ముతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం విపరీతంగా పెరిగింది. ఇక అప్పటి నుంచి బీర్ల అమ్మకాలు పెరిగి పోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి పూట 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా,  రాత్రి పూట వాతావరణం చల్లగా మారింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎండలు ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు చేరకున్నాయి. దీంతో జనాలు ఎండ వేడికి అల్లాడి పోయారు. ఈ సమయంలో ఎండ వేడిని తట్టుకోవడానికి మందు బాబులు చల్లని బీర్ల వైపు మొగ్గు చూపారు. దీంతో మార్చి నుంచి మే నెల వరకు 60 శాతానికి పైగా విక్రయాలు పెరిగాయి. మొత్తం మీద 5 నెలల్లోనే మద్యం ప్రియులు అక్షరాలా రూ.89.83 కోట్ల విలువ చేసే బీర్లు తాగేశారు.

గతేడాది, ఈ ఏడాది అమ్మకాలు ఇలా..
          
2020 లో                     బీర్లు (కేసులు)    2021లో           బీర్లు(కేసులు) 
జనవరి       రూ.16 కోట్లు       1.18 లక్షలు     రూ.17 కోట్లు         1.20 లక్షలు
ఫిబ్రవరి     రూ.19 కోట్లు        1.42 లక్షలు     రూ.14 కోట్లు         83 వేలు
మార్చి       రూ.11 కోట్లు         86 వేలు          రూ.22 కోట్లు         1.27 లక్షలు 
ఏప్రిల్‌        లాక్‌డౌన్‌            --------             రూ.22 కోట్లు           1.30 లక్షలు 
మే             రూ.15 కోట్లు        90 వేలు          రూ. 14.83 కోట్లు      88 వేలు   

చదవండి: మందుబాబు ఆత్రం.. రూ1.5ల‌క్ష‌లు గోవింద‌

మరిన్ని వార్తలు