విద్యుత్‌ సంస్థల్లో 250 మందికి రివర్షన్లు!

22 Nov, 2022 03:06 IST|Sakshi
విద్యుత్‌ సౌధలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు  

సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు యాజమాన్యాల కసరత్తు

2014 జూన్‌ 1 నాటి సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు

చివరి దశకు చేరిన ప్రక్రియ.. నేడో రేపో ఉత్తర్వులు 

విద్యుత్‌ సౌధలో నిరసన తెలిపిన తెలంగాణ ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో 172 మంది ఇంజనీర్లతో పాటు మొత్తం 250 మంది ఉద్యోగులకు రివర్షన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌  యాజమాన్యాలు వారం రోజులుగా చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది.  ఒకటì , రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం. 

నెలాఖరులో సుప్రీంకోర్టులో విచారణ..
విద్యుత్‌ ఉద్యోగుల విభజన కేసు విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకుగాను విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తమ ఆదేశాలను అమలు చేసి ఆ మేరకు అఫిడవిట్‌ను సమర్పించాలని, నెలాఖరులోగా మళ్లీ విచారణ నిర్వహి­స్తామని.. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్న­తులు, వేతన బకాయిలను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి దాదాపు 700 మందిని జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు కేటాయించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2014 జూన్‌ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా కొత్తగా పదోన్నతులు కల్పించాలని ధర్మాధికారి కమిటీ సిఫారసు చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదోన్నతులు పొందిన తెలంగాణ ఉద్యోగుల్లో 250 మంది రివర్షన్లు పొందనున్నట్టు సమాచారం. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం సీనియర్లు ఉండటంతో వారికి పదోన్నతులు లభించనున్నాయి. 

రివర్షన్లు ఇస్తే ఒప్పుకోం.. 
తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్లు ఇస్తే అంగీకరించమని ఇప్పటికే తెలంగాణ విద్యుత్‌ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్‌ సౌధలో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగకుండా సూపర్‌­న్యూమరరీ పోస్టులను సృష్టించాలని వారు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు