మేలో ఎంసెట్‌?

29 Dec, 2023 04:15 IST|Sakshi

అప్పుడే సరైన సమయమంటున్న అధికారులు!

పరీక్ష తేదీలపై విద్యాశాఖ సమీక్ష    

సాక్షి, హైదరాబాద్ః ఇంటర్‌ పరీక్షల తేదీలు వెల్లడవ్వడంతో ఎంసెట్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు. సాధారణంగా ఎంసెట్‌ పరీక్షల తేదీలను ఇంటర్, జేఈఈ మెయిన్స్‌ తేదీలను బట్టి నిర్ణయిస్తారు. ఇంటర్‌ పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయి. జేఈఈ ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మే నెలలో ఎంసెట్‌ నిర్వహణ సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు.

గత ఏడాది జేఎన్‌టీయూహెచ్‌కు ఎంసెట్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది. అయితే, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సీజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి, ఎంసెట్‌ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది.

టెన్త్‌పై మరోసారి సమీక్ష
గతేడాది ఎంసెట్‌ దరఖాస్తుల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎంసెట్‌ ప్రశ్న పత్రాం కూర్పుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్న తాధికారులు చర్చించారు. ఇదే క్రమంలో పదవ తరగతి పరీక్షలపైనా ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలు స్తోంది.

మార్చితో ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో ఇదే నెల ఆఖరు వారంలో లేదా ఏప్రిల్‌ మొదటి వా రంలో టెన్త్‌ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టెన్త్‌ పరీక్షల్లో మార్పులు, చేర్పులు చేయాలా అనే అంశంపై త్వరలో అధికారులు మరో దఫా సమీక్షించే వీలుంది. 

>
మరిన్ని వార్తలు