నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..!

28 Aug, 2022 08:07 IST|Sakshi

ప్రతిరోజూ నాన్నా నాన్నా అని పిలిచే తన తండ్రికి ఏం జరిగిందో తెలియక ఆ పిల్లలు అమాయకంగా చూస్తుంటే అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి

‘మాలాగా కూలీ నాలీ చేసుకొని బతకకుండా... ఉద్యోగం వస్తే కొడుకుకు కష్టాలు తప్పుతాయనుకున్న. అప్పు తెచ్చి డబ్బులు ఇచ్చిన. ఉద్యోగం వచ్చిందని అందరం సంబరపడ్డం. నాలుగు నెలలకే ఆ ఉద్యోగం పోయింది. మోసపోయేసరికి.. నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నువ్వుపోయినవు.. నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..’ అంటూ కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో హరీశ్‌ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

కలకాలం తోడుంటానని బాసలు చేసి అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ మహిళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు రోడ్డున పడ్డారు. భర్త అకాలమరణం తట్టుకోలేక భార్య రవళి పిల్లలను ఒళ్లో పెట్టుకుని రోదించిన తీరు అందరినీ కదిలించింది. ఉద్యోగం వచ్చిందని ఎంతో ఆశతో వెళ్లిన ఆ యువకుడు.. విగతజీవిగా తిరిగిరావడంతో     విషాదం అలుముకుంది.

కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌టౌన్‌/శంకరపట్నం: కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ముంజ శోభ–రవి దంపతులకు ఒక్కగానొక్క సంతానం ముంజ హరీశ్‌(32). అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగం ఇపిస్తానని ఓ దళారీ చెప్పడంతో ఆశపడి, అప్పుచేసి రూ.7 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఉద్యోగం వచ్చినప్పటికీ నాలుగు నెలల్లోనే తొలగించడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురయ్యాడు.

తాను మోసపోయానని కుమిలిపోయాడు. ఉద్యో గం ఎలాగూ లేదు.. కనీసం తాను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని దళారులను వేడుకున్నాడు. వారు చేతులెత్తేయడంతో పరిస్థితిని తలుచుకొని కుంగిపోయిన హరీశ్‌ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ అయింది. తన వాట్సాప్‌ స్టేటస్‌లో మా త్రం తనకు డబ్బులు వస్తే తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల ని.. బై.. బై.. అంటూ.. తాను ఏదో చేసుకుంటున్నట్లు పోస్ట్‌ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించారు. వారు వెంటనే లొకేషన్‌ ట్రేస్‌ చేసి శని వారం ఉదయం కమాన్‌పూర్‌ మండలం సిద్దపల్లి శివారులోని బావిలో మృతదేహాన్ని గుర్తించారు. 

ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
హరీశ్‌ మృతదేహాన్ని పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు వందల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. గొడవలు జరిగే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను ఆసుపత్రి వద్ద మోహరించారు. అయినప్పటికీ ఆగ్రహానికి గురైన బంధువులు, గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

మిన్నంటిన రోదనలు
చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి దూరమైన హరీశ్‌ను తలచుకుంటూ కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఆసుపత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి. హరీశ్‌ ఆత్మహత్య విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మృతుడి బంధువులు, గ్రామస్తులు, స్నే హితులతో కలిసి మంచిర్యాల చౌరస్తాలో సుమా రు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలను సీటీసీకి తరలించారు.

మోహరించిన పోలీసులు
పోలీసుల పహారా మధ్య శనివారం ముంజ హరీశ్‌ మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆçస్పత్రినుంచి అంబాల్‌పూర్‌ గ్రామానికి తీసుకువచ్చారు. కారకులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌–వరంగల్‌ రహదారిపై రాస్తారోకో చేసిన కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌ తరలించారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంపై పడి రోదించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండడంతో హుజూరాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో రూరల్‌ సీఐ జనార్దన్,     ఎస్సై చంద్రశేఖర్, 60 మంది పోలీసులు మోహరించారు.

మరిన్ని వార్తలు