నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మిల్లింగ్‌ బంద్‌ 

9 Nov, 2020 08:20 IST|Sakshi
మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం ఇస్తున్న రైస్‌ మిల్లర్లు

సాక్షి, కరీంనగర్‌: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కొర్రీలపై రైస్‌ మిల్లర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. సీఎంఆర్‌ నాణ్యత విషయంలో పెడుతున్న కొర్రీలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మిల్లర్లు కఠిన నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానాకాలం సన్నరకం ధాన్యం ప్రభుత్వం కేటాయించనుండడం, సీఎంఆర్‌ తగ్గే అవకాశం ఉండడం, ఎఫ్‌సీఐ నిబంధనలతో కోట్లల్లో నష్టం వస్తుండడంతో ధాన్యం మిల్లింగ్‌ సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కింద ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉన్న బియ్యంపై ఆ సంస్థ పెడుతున్న ఆంక్షలు మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు ఫలించకపోవడంతో సీఎంఆర్‌ నిలిపివేతవైపే మిల్లర్లు మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మిల్లింగ్‌ నిలిపివేయాలని నిర్ణయించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితిలో మిల్లింగ్‌ నిలిపివేస్తే కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది.

మిల్లర్లపై ఒత్తిళ్లు..
ప్రతీ సీజన్‌లో ధాన్యం తీసుకునే విషయంలో మిల్లర్లపై పౌరసరఫరాలశాఖ ఒత్తిళ్లు సాధారణంగా మారాయి. పంట కోతల సమయంలో వర్షం, తెగుళ్లు ఇతర సమస్యలతో ధాన్యం నాణ్యత తగ్గిపోతోంది. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కొనుగోళ్లలో సడలింపులు ఇస్తోంది. ఇవే సడలింపులతో గత వానాకాలంలో తెగుళ్లు సోకిన ధాన్యం కొనుగోలు చేసి, తమకు కట్టబెట్టడాన్ని మిల్లర్లు వ్యతిరేకించారు. అనంతరం దిగుమతి చేసుకున్నారు. సదరు ధాన్యం మరాడించగా.. వచ్చిన బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ ఇబ్బంది పెడుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రెండునెలల క్రితం నాణ్యతతో కూడిన బియ్యం ఉత్పత్తిపై జిల్లా అధికారులు ఎఫ్‌సీఐ నాణ్యత నియంత్రణ అధికారులతో మిల్లర్లకు అవగాహన కల్పించారు. చివరికి బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నిరాకరించడంతో ప్రభుత్వమే దిగి వచ్చి, పొడి బియ్యం బదులు బాయిల్డ్‌ బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా యాసంగికి సంబంధించి సీఎంఆర్‌ బియ్యం తీసుకోవడానికి కూడా ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. ఈ క్రమంలో బియ్యంతోపాటు ప్యాకింగ్‌ చేసే సంచుల నాణ్యత కూడా సమస్యగా మారడంతో మిల్లర్లు సమ్మెకు దిగుతున్నారు.

సన్నధాన్యం సేకరణపై ప్రభావం
నియంత్రిత సాగుపై ప్రభుత్వ ప్రచారంతో ఈ సీజన్‌లో 60 నుంచి 70శాతం మంది రైతులు సన్నరకం ధాన్యం సాగుచేశారు. దీంతో సన్నాల దిగుబడి ఈ సారి ఇబ్బడిముబ్బడిగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ వానాకాలం సీజన్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 18,78,958 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. సన్నధాన్యం సాధారణ రకం కిందకు రావడం, ఈ సీజన్‌లో పొడి బియ్యం సీఎంఆర్‌గా ఇవ్వాల్సి ఉండడం, తదితర కారణాలతో మిల్లర్లు ఎఫ్‌సీఐ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ధాన్యాన్ని పొడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటం, ప్రభుత్వానికి పొడి బియ్యమే ఎక్కువగా అవసరం కావడంతో మిల్లర్లు సీజన్‌కు ముందే ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. 

సమస్యలు పరిష్కరిస్తేనే మిల్లింగ్‌..
చిన్నచిన్న సాకులతో సీఎంఆర్‌ సేకరణకు ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. గోదాములకు పంపిన బియ్యాన్ని తిప్పి పంపుతోంది. తిరిగి పాలిష్‌ చేసి పంపడానికి ఒక లారీకి అదనంగా రూ.7 వేల భారం పడుతోంది. ఈ సారి సన్న వడ్ల లెవీ తక్కువ వస్తుంది. నిబంధనల ప్రకారం సీఎంఆర్‌ ఇవ్వడం మిల్లర్లకు కష్టమే. రైస్‌ మిల్లర్లకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. న్యాయం చేయాలని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌ను కలిసి వినతిపత్రాలు అందించాం. సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి మిల్లింగ్‌ నిలిపివేస్తున్నాం. – నగునూరి అశోక్‌కుమార్, రైస్‌ఇండస్ట్రీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి 

మరిన్ని వార్తలు