మల్లు స్వరాజ్యానికి ఆత్మీయ నివాళి

2 Apr, 2022 03:13 IST|Sakshi
మల్లు స్వరాజ్యం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ 

‘అమ్మకు వందనం’పేరిట కార్యక్రమం 

రాయదుర్గం(హైదరాబాద్‌): భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం ఆయుధం చేతపట్టి రజాకార్లను గడగడలాడించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకతీతంగా నేతలు ఘనమైన నివాళులు అర్పించారు. రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘అమ్మకు వందనం’పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ, రాంసుందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.

ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ పార్టీల నాయకులు మల్లు స్వరాజ్యంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పేదల పక్షాన ఆమె జీవితాంతం చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఎదురుగా ఉంచిన పుస్తకంలో ఆమె గురించిన జ్ఞాపకాలను నాయకులు, ప్రజాప్రతినిధులు నమోదు చేశారు.

కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీమంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్,  మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రజాగాయకుడు గద్దర్, ఆయా పార్టీల నాయకులు డాక్టర్‌ కె.నారాయణ, ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు