గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి 

29 May, 2022 02:16 IST|Sakshi
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సురవరం, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి. చిత్రంలో చాడ, రసమయి, జూలూరు 

పలువురికి సురవరం స్మారక పురస్కారాల ప్రదానం 

గన్‌ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్‌): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాగా, సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్‌ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్‌.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. 

ప్రజల పక్షాన నిలిచిన సురవరం 
నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు