పొంచి ఉన్న ‘మహా’ ముప్పు!

24 Feb, 2021 03:14 IST|Sakshi
బోధన్‌ మండలంలోని సాలూర చెక్‌పోస్ట్‌ వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో హైరానా

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిత్యం వేలాది మంది రాకపోకలు

కనిపించని ఆంక్షలు.. స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన  

సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్‌/బోధన్‌ రూరల్‌ (బోధన్‌)/నిజామాబాద్‌ అర్బన్‌/ కాళేశ్వరం: పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్‌ భయం నెలకొంది. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడి వారు తెలంగాణలోకి వస్తుండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి సరిహద్దుల్లో లాక్‌డౌన్‌ సమయంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఇప్పుడు అలాంటి చర్యలేవీ లేకపోవడంతో రాష్ట్ర పోలీసు, వైద్య శాఖలు అప్రమత్తమవ్వాల్సిన అవసరమేర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని ఉన్న నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల పరిధిలో పట్టణాలకు, అటు ఉమ్మడి నిజామాబాద్‌కు సరిహద్దునున్న ప్రాంతా లకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు.

ఆదిలాబాద్‌ జిల్లా పెన్‌గంగ నదీ వద్ద 44వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న వాహనాలు

మరోవైపు రైల్వే మార్గాలతో పాటు మూడు జాతీయ రహదారులు, ఇతర రోడ్డు మార్గాల గుండా జనాలు వ్యాపార, వాణిజ్యంతో పాటు బంధుత్వ కారణాలతో వస్తూపోతుంటారు. ఇటు ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు నిత్యం మహారాష్ట్రకు వెళ్లి వస్తుంటాయి. నిర్మల్‌ జిల్లాలో భైంసా మీదుగా మహారాష్ట్రలోని భోకర్, ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా యావత్మల్, నాగ్‌పూర్‌ వైపు, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మీదుగా బల్లర్షా, చంద్రాపూర్‌ వైపు, నాగ్‌పూర్, మంచిర్యాల జిల్లా కోటపల్లి మీదుగా సిరోంచ, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు నాలుగు వైపులా ప్రధాన దారులున్నాయి.

ఈ సరిహద్దుల గుండా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో పెన్‌గంగా నది వద్ద జాతీయ రహదారిపై రోజూ వేలాది వాహనాలు వెళ్తుంటాయి. గతేడాది మార్చిలో కరోనా మొదలైన తర్వాత ఇక్కడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి శాశ్వతంగా ఓ షెడ్‌ను నిర్మించారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత షెడ్‌ అలాగే ఉన్నప్పటికీ రాకపోకలు సాధారణమయ్యాయి.

తెలంగాణ, మహారాష్ట్రను కలిపే నిర్మల్‌ జిల్లా తానూరు మండలం పరిధిలో జాతీయ రహదారి

అక్కడి ప్రయాణికులకు టెస్టులు..
ఇటు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని సాలూర, ఖండ్‌గావ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద సాలూర పీహెచ్‌సీ వైద్య సిబ్బంది మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికులకు మాస్కులు, శానిటేషన్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి బస్సుల్లో, ఇతర వాహనాల్లో వచ్చిన వారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. మంగళవారం సాలూర చెక్‌ పోస్ట్‌ వద్ద మెడికల్‌ ఆఫీసర్‌ రేఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది 23 మందికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటెవ్‌ వచ్చింది.. కాగా, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పక్బందీగా చెక్‌పోస్ట్‌ల వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బోధన్‌ మండలంలోని హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సాలూర, ఖండ్‌గావ్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీ, పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

కాళేశ్వరంలోని అంతర్‌ రాష్ట్ర వంతెన 

కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద యథేచ్చగా..
కాళేశ్వరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బస్టాండ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేశారు. కానీ జిల్లాలోని మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఎలాంటి వైద్య శిబిరాలు, చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయలేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు