పెరిగిన ఇంధన ధరలు, ప్రత్యామ్నాయంగా ప్రజల చూపు వాటి వైపు

21 Jul, 2021 08:36 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో నగరవాసులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. నెల రోజులుగా గ్రేటర్‌లో ఈ వాహనాల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలకు జీవితకాల పన్నుతో పాటు వాహనం రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ కింద 2 లక్షల బైక్‌లకు ఈ మినహాయింపు వర్తించనుంది. అలాగే మరో 10 వేల వరకు కార్లు,  3 వేల ఆటోలు, తదితర రవాణా వాహనాలకు కూడా ఈ మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల  క్రితంరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతంఈ అంశాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు.  

ఇంధన ధరల మోతతో...  
కొంతకాలంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతుండడంతో జనం దృష్టి  ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు  మళ్లింది. గత నెల రోజులుగా సుమారు 5 వేలకు పైగా బైక్‌ల విక్రయాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్లు, ఆటోలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. బుకింగ్‌ల పట్ల మాత్రం ఆసక్తి చూపుతున్నట్లు నగరంలోని ఓ ఎలక్ట్రిక్‌ వాహనషోరూమ్‌ నిర్వాహకులు ఒకరు తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపైన ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమల్లోకి తేవడానికి ముందు నుంచే నగరంలో వీటి అమ్మకాలు  జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది.  

స్పష్టత లేని 2 శాతం పన్ను... 
ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ కింద కొన్ని వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. కానీ రవాణాశాఖ కొంతకాలంగా  రెండో బండిపైన 2 శాతం అదనంగా పన్ను వసూలు చేస్తోంది. అంటే ఒకే వ్యక్తి తన పేరిట అప్పటికే ఒక వాహనం ఉండి మరో వాహనాన్ని కొత్తగా కొనుగోలు చేసినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు పన్ను మినహాయింపును ఇచ్చినప్పటికీ రెండో వాహనం నిబంధనపైన మాత్రం రవాణాశాఖ స్పష్టతను ఇవ్వలేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ కింద ఇప్పుడు మినహాయింపునిచ్చినా భవిష్యత్తులో అదనపు పన్నుల మోత తప్పకపోవచ్చేమోననే ఆందోళన  వ్యక్తమవుతోంది.   

చార్జింగ్‌ కేంద్రాలు ఉంటే... 
► ఒకసారి బైక్‌లు  చార్జింగ్‌ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.  
► ప్రస్తుతం నగరంలో విద్యుత్‌ చార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల వాహనదారులు ఇంటి వద్ద చార్జింగ్‌ చేసుకొని బయలుదేరుతున్నారు. కానీ నిర్ధేశిత దూరం కంటే ఎక్కువ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి మరోసారి చార్జింగ్‌ చేసుకోవలసి వస్తోంది. – చార్జింగ్‌ కేంద్రాల కొరత వల్లనే  కార్లు, ఆటోలు, తదితర వాహనాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు.  
► అన్ని ప్రధాన కూడళ్లు, బంకులు, సూపర్‌మార్కెట్‌లు, మాల్స్‌ తదితర కేంద్రాల్లో తప్పనిసరిగా చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2018లోనే రవాణాశాఖ సూచించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్‌లు, కొన్ని ఆర్టీసీ బస్‌డిపోలు, తదితర చోట్ల మినహా చార్జింగ్‌ కేంద్రాలు లేవు. పైగా ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్‌ బస్సులకు మాత్రమే చార్జింగ్‌ సదుపాయం ఉంది. మిగతా చోట్ల సాధారణ ప్రజలకు  అందుబాటులోకి రాలేదు.  
► ఈటో వంటి ఆటోరిక్షా సంస్థలు తమ వాహనాల అమ్మకాలు పెరిగితే విద్యుత్‌ చార్జింగ్‌ కేంద్రాలను స్వయంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు