తెలంగాణపై పడగ విప్పిన ఒమిక్రాన్‌!

2 Jan, 2022 21:17 IST|Sakshi

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. వారం రోజుల్లో రెట్టింపు

కొద్ది రోజులుగా స్థానిక కరోనా కేసుల్లోనూ పెరుగుదల

తాజాగా రాష్ట్రంలో 3 నెలల తర్వాత ఒక్కరోజే 300 పైబడి కేసులు

కొత్త వేరియెంట్‌ కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాల అనుమానం 

మరో 2 వారాల్లో రోజూ వెయ్యి కరోనా కేసులు నమోదవ్వొచ్చని అంచనా 

రాష్ట్రంలో మరో 12 మందికి ఒమిక్రాన్‌

79కి చేరిన కేసులు

10 వరకు ఆంక్షలు పొడిగింపు..

సామూహిక మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం

మాస్క్‌ లేకుంటే జరిమాన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపం లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యా యి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదవగా శనివారం నాటికి ఈ కేసులు 79కి చేరుకున్నాయి. ఇదే సమయం లో క్షేత్రస్థాయిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్రంలో ఒక్క రోజులో 300కు పైబడి కేసులు నమోదవగా ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒక్కరోజే దాదాపు 200 కేసులు తేలాయి.

నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 2 శాతం మందికే పరీక్షలు చేస్తుండటం, వీళ్లలోనే 70 శాతం ఒమిక్రాన్‌ కేసులు బయటడిన నేపథ్యం లో కొత్త వేరియంట్‌ ఇప్పటికే కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా నమోదవుతు న్న కేసుల్లో ఒమిక్రాన్‌ ఉండొచ్చని భావిస్తున్నాయి. ఓవైపు జనజీవనం సాధారణ స్థితికి చే రుకోవడం, మరోవైపు సంక్రాంతి రాకపోకలు పెరుగుతుండటం, పైగా ప్రజలు కరోనా జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రెండు వారాల్లో రాష్ట్రంలో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నాయి.  

ఒక్కో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు రూ. 6 వేలు 
కరోనా వైరస్‌ను ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు (ర్యాట్‌), ఆర్టీపీసీఆర్‌ పరీక్షలతో గుర్తిస్తున్నారు.  అయితే వైరస్‌ను నిర్ధారించినా అందులోని వేరియంట్‌ గుర్తించాలంటే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలు సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ), సీడీఎఫ్‌డీ (సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ డయాగ్నస్టిక్స్‌), గాంధీ ఆస్పత్రులే చేస్తున్నాయి.

సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ సంస్థల పరిధిలో నెలకు సగటున 6 వేల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు చేసే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లతో పాటు ఉత్తర కర్ణాటక రీజియన్‌ పరీక్షలు కూడా ఈ సంస్థలే చేస్తున్నాయి. ఈ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కిట్‌ విలువ రూ. 6 వేల వరకు ఉన్నట్లు సమాచారం. శాంపి ల్‌ తీసుకున్నాక 4 దశల్లో విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. 

క్షేత్రస్థాయి కేసుల్లో సీక్వెన్సింగ్‌ ఏది? 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించగానే కొన్ని దేశాలను రిస్క్‌ కేటగిరీలో చేర్చారు. ఆ దేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని, పాజిటివ్‌గా తేలితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో 2 శాతం మందికి పరీక్షలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో 70 శాతానికి పైగా నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వాళ్లకే సోకడం గమనార్హం.

నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై పెద్దగా నిఘా పెట్టకపోవడం, మరోవైపు రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రయాణికుల రాకపోకలు ఉండటంతో ఒమిక్రాన్‌ ఇప్పటికే కమ్యూనిటీలోకి చేరిందనే భావన వైద్యారోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఒమిక్రాన్‌గా అంచనా వేయొ
చ్చని అంటున్నారు. పైగా క్షేత్రస్థాయి కేసుల్లోని కేసుల్లో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ను గుర్తించట్లేదు.

లోడ్‌ ఎక్కువే.. కానీ ప్రభావం తక్కువ 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదకరం కాదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్‌ కేసుల్లో కొందరికే సాధారణ లక్షణాలైన జ్వరం, దగ్గు తదితరాలే ఉన్నట్టు చెబుతున్నారు. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ లోడ్‌ చాలా ఎక్కువుందని, కానీ దీని ప్రభావం ఊపిరితిత్తులపై పెద్దగా లేదని పలు పరిశీలనల్లో తేలినట్టు నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ వైద్యులు డాక్టర్‌ కిరణ్‌ మాదల తెలిపారు. ఏదేమైనా ప్రజలు తప్పకుండా మాస్కు ధరించాలని, హ్యాండ్‌ వాష్‌ లేదా శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. 

ఆ కేసులే కావొచ్చు 
ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కువవుతున్నాయి. ఇలా వ్యాప్తి పెరగడమంటే కొత్త వేరియంట్‌ వచ్చినట్లేనని భావించవచ్చు. ప్రస్తుత కేసుల్లో ఒమిక్రాన్‌ అధికంగా ఉన్నట్లు అనుమానిస్తున్నాం. కొత్త కేసులన్నీ ఈ వేరియంట్‌తో కూడినవని అంచనా వేయొచ్చు.      


– జి. శ్రీనివాసరావు, డీహెచ్‌ 

మరిన్ని వార్తలు