ఎలక్ట్రిక్‌ వాహనాలు పది రెట్లు!

18 Sep, 2022 03:18 IST|Sakshi

రాష్ట్రంలో ఏడాదిన్నరగా భారీగా పెరిగిన విక్రయాలు

రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపుతో ఊపు

త్వరలో దేశీయంగా బ్యాటరీల తయారీ

పెరుగుతున్న చార్జింగ్‌ స్టేషన్లు

కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయనే అంచనాలు

సాక్షి, హైదరాబాద్‌: తక్కువ ఖర్చుతో ప్రయాణం, కాలుష్యం నుంచి దూరం, నడపడం సులభం.. పైగా ప్రభుత్వ రాయితీలు అన్నీ కలిసి రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలోనే రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పది రెట్లు పెరిగింది. నిజానికి ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చి నాలుగైదు ఏళ్లు దాటిపోయినా.. గత ఏడాదిన్నరగా డిమాండ్‌ పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం దీనికి తోడ్పడిందని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో కాస్త ఆలస్యంగా మొదలై..
దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభు­త్వం గతంలోనే దృష్టి పెట్టింది. రాయితీలు, ప్రోత్సా­హకాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి పలు రాష్ట్రాలు మొదట్లోనే స్పందించి చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలతో పాలసీని ప్రకటించింది.

రాష్ట్రంలో కొనుగోలు అయ్యే తొలి రెండు లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్డు పన్ను, 100 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజును మినహాయి­స్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ఏర్పడింది. రెండు లక్షల వాహనాలను మించితే రాయితీ రాదన్న ఉద్దేశంతో కొనుగో­ళ్లు పెరిగాయి. ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లు, బస్సులు, కార్ల విషయంగా కూడా రాయితీలు ప్రకటించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను పెంచుతామని.. స్థానికంగా వాహనాల తయా­రీని ప్రోత్సహిస్తామని పేర్కొం­ది. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లపై సానుకూల ప్రభావం చూపాయి.

ఏడాదిన్నరలో..
2020 సంవత్సరం చివరలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని ప్రకటించింది. అంతకుముందు రాష్ట్రంలో కేవలం 3,838 ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే రోడ్డెక్కాయి. పాలసీ వచ్చాక వీటి సంఖ్య 32,741కి పెరి­గిం­ది. పాలసీకి పూర్వం రాష్ట్రంలో 2,788 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు మాత్రమే అమ్ము­డు­కాగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 28,389కి పెరిగింది. అంటే పది రెట్లు పెరగడం గమనార్హం. ఇక అప్పట్లో రాష్ట్రంలో కేవలం 567 ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీలర్స్‌ ఉండగా.. ప్రస్తుతం 2,729కు చేరింది.

బ్యాటరీ పేలుళ్లతో ఆందోళన
ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల్లోని బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు కొనుగోలుదారుల్లో కొంత ఆందోళన రేపుతున్నాయి. అయితే చైనా తయారీ నాసిరకం బ్యాటరీలు మాత్రమే ఆ ప్రమాదాలకు కారణమని.. చార్జింగ్, వాహన వినియోగం విషయంలో కంపెనీల మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు జరగవని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

దేశీయంగా బ్యాటరీల తయారీ పెరుగుతుండటంతో.. త్వరలో నాణ్యమైన వాహనాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ మొదలైందని.. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, త్వరలో అవి పరిష్కారమవుతాయని ఏఆర్‌సీఐ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డా.తాతా నరసింగరావు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు